కృష్ణా వాట‌ర్ పై ఏపీ, తెలంగాణ వార్.. జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణంపై వివాదం

ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొన‌సాగుతోంది. ఆ క్ర‌మంలో తాజాగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం వ‌ద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:18 PM IST

ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొన‌సాగుతోంది. ఆ క్ర‌మంలో తాజాగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం వ‌ద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. శ్రీశైలం నుంచి నీటిని తోడేందుకు మ‌రో రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం ఏపీ చేపడుతోంద‌ని ఫిర్యాదు చేసింది. తాజా రిజ‌ర్వాయ‌ర్ కు సంబంధించిన టెండ‌ర్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఆహ్వానించింద‌ని తెలిపింది. రూ. 680 కోట్ల‌తో 2.41 వేల మిలియ‌న్ క్యూబిక్ అడుగుల సామ‌ర్థ్యంగ‌ల రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేపడుతుంద‌ని తెలంగాణ ఇరిగేష‌న్ శాఖ చీఫ్ ఇంజ‌నీర్ ముర‌ళీథ‌ర్ బోర్డుకు లేఖ రాశాడు. టెండ‌ర్ల‌ను నిలిపివేయాల‌ని సూచించాడు. దీంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య మ‌రోసారి నీళ్ల వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది.
సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌, కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌శాఖ ఇచ్చిన అనుమ‌తుల ప్ర‌కారం కేవ‌లం 34టీఎంసీ నీళ్ల‌ను మాత్ర‌మే శ్రీశైలం నుంచి వ‌ర‌దల స‌మ‌యంలో మ‌ళ్లించ‌డానికి వీలుంది. కానీ, ఇప్ప‌టికే ఈ ఏడాది 82 టీఎంసీల నీళ్ల‌ను పోతిరెడ్డిపాడు ద్వారానూ హంద్రీనీవా, సుజ‌ల స్ర‌వంతి ద్వారా మ‌రో 11.2 టీఎంసీల నీళ్ల‌ను మ‌ళ్లించారు.
మొత్తంగా 93.29 టీఎంసీ నీళ్ల‌ను రాయ‌ల‌సీమ‌కు ఏపీ మ‌ళ్లించింద‌ని తెలంగాణ ఫిర్యాదు చేసింది. నీళ్ల మ‌ళ్లింపుపై అత్య‌వ‌స‌రంగా ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించాల‌ని కృష్ణాబోర్డుకు ముర‌ళీధ‌ర్ లేఖ రాయ‌డం వివాద‌స్పదం అయింది.
తాజాగా ఏపీ మ‌ళ్లించిన నీళ్ల కార‌ణంగా శ్రీశైలం, నాగార్జున‌సాగ‌ర్ ప‌రిధిలోని తెలంగాణ ప్రాంతం న‌ష్ట‌పోతుంద‌ని కృష్ణాబోర్డుకు రాసిన లేఖ‌లో తెలంగాణ పొందుప‌రిచింది. త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.