తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న (Watchman Ranganna Dies) మరణించడం కొత్త చర్చలకు దారితీసింది. 85 ఏళ్ల వయసున్న రంగన్న కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు రంగన్న మరణాన్ని ధ్రువీకరించగా, కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం
2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన సమయంలో రంగన్న వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయనకు ఈ కేసులో ప్రధాన సాక్షిగా ప్రాముఖ్యత వచ్చింది. సీబీఐ దర్యాప్తులోనూ రంగన్న కీలక వాంగ్మూలాన్ని అందించారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లోనూ రంగన్న ఇచ్చిన వివరాలు ప్రస్తావించబడ్డాయి. ఈ హత్య కేసులో నిందితుల విచారణ, బెయిల్ వివాదాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే వివేకా హత్య కేసు అనేక రాజకీయ మలుపులు తీసుకుంది. రాష్ట్ర పోలీసుల నుంచి కేసు సీబీఐ చేతికి వెళ్లినప్పటికీ, దర్యాప్తు మరింత ఆలస్యం అవుతోందనే విమర్శలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈ కేసు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నిందితుల కస్టడీ, సాక్షుల భద్రత వంటి అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజా పరిణామంలో రంగన్న మరణించడంతో కేసు దర్యాప్తుపై మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
Coconut Water : కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగితే మంచిది కాదు – డాక్టర్స్
వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి మరణించడంతో దర్యాప్తుపై మరింత అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఇక ఎలా ముందుకు సాగుతుందన్న దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ కొనసాగుతుందా, లేక మరిన్ని సాక్ష్యాధారాలను సీబీఐ సమకూర్చుకుంటుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.