Jagan Davos Tour: జగన్ దావోస్ పర్యటనపై విమర్శలు.. అందులో నిజానిజాలేంటి?

సీఎం జగన్ పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లారు. ఎలా వెళ్లారు, లండన్లో ఎందుకు దిగారన్నది అనవసరం. దావోస్కి వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చామా లేదా అన్నదే పాయింట్.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 08:00 PM IST

సీఎం జగన్ పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లారు. ఎలా వెళ్లారు, లండన్లో ఎందుకు దిగారన్నది అనవసరం. దావోస్కి వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చామా లేదా అన్నదే పాయింట్. ఆ విషయంలో జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న కామెంట్లు అన్నీఇన్నీ కావు. నిజానికి ఒకప్పుడు చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ విసిరిన బాదుడే బాదుడు అనే బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు, ఛార్జీలు, పన్నుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించని కోణం లేదు. ఇప్పుడు జగన్ కూడా అవే చేస్తున్నారు. అప్పుడు వైసీపీ లీడర్లు చేసిన విమర్శల్లో నిజం ఉంటే.. ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్లోనూ అంతే వాస్తవం ఉన్నట్టు లెక్క. ఇక దావోస్ పర్యటన గురించి ప్రముఖంగా
మాట్లాడుకోవాలి.

పెట్టుబడులు రావాలంటే సూటూబూటు, సూట్కేసులు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగితే రావంటూ ఒకనాడు విమర్శించింది వైసీపీ. జగన్ నోటి నుంచే ఈ మాటలు వినిపించాయి. ప్రత్యేక హోదా ఒక్కటి తెస్తే చాలు.. కూర్చున్న చోటు నుంచే పెట్టుబడులు రప్పించుకోవచ్చు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొచ్చు అని ఆనాడు జగన్ కామెంట్ చేశారు. అసలు ఎన్నికల స్లోగనే అది. పాతికకు పాతిక ఎంపీ స్థానాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధించుకు వస్తానన్నారు. హోదా వస్తే ఏ ఒక్క దేశానికి పెట్టుబడుల కోసం తిరగక్కర్లేదని ప్రతి ఒక్కరి చెవిలో చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కోసం ప్లీజ్ ప్లీజ్ అనాల్సిందేనన్నారు. చివరికి అదే పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లారు జగన్. ఈ విషయంలో చంద్రబాబు చేసిందే జగన్ చేస్తున్నారు. పైగా దావోస్ ఆహ్వానం అందుకోవడం కోసం డబ్బులు చెల్లించి మరీ అక్కడ ఒక పెవిలియన్ కొనుక్కున్నారని ఆనాడు విమర్శించారు. మరిప్పుడు టీడీపీ కూడా అదే విమర్శలు చేస్తోంది. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అంటూ నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. మరి దీనికి జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం క్రియేట్ చేయాలి గానీ.. దావోస్ పర్యటనతో ఉపయోగం ఉండదు అని ఆనాడు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇప్పుడు జగన్ కూడా దావోస్ వెళ్లారంటే.. ఏపీలో పెట్టుబడుల వాతావరణం లేదని ఒప్పుకున్నట్టేనా?

ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రతిపక్ష నేతగా జగన్ దుమ్మెత్తిపోశారు. ఇప్పుడదే జగన్ ప్రత్యేక విమానంలో వయా లండన్ దావోస్ వెళ్లారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే వైఎస్ భారతిని వెంట తీసుకెళ్లడం. ఒక అధికారిక పర్యటనలో ఇలా కుటుంబంతో వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధాన విమర్శ. అందులోనూ లండన్లో దిగారు. అంటే.. అక్కడ చదువుతున్న తన కూతుళ్లను చూసేందుకా? అదే నిజమైతే.. జగన్ అతిపెద్ద తప్పు చేసినట్టేనా? ప్రజల డబ్బుతో, ప్రత్యేక విమానాల్లో, కుటుంబం తిరగడం కచ్చితంగా తప్పుపట్టాల్సిందే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దావోస్ కనే కాదు ఢిల్లీ గట్రా వెళ్తున్నా ప్రత్యేక విమానాల్లో జగన్ ప్రయాణిస్తున్నారు. ఒకనాడు చంద్రబాబు కూడా ప్రత్యేక విమానాల్లోనే తిరిగారు. ఆ విమర్శలు కూడా దావోస్ పర్యటన కారణంగా ఎదుర్కొంటున్నారు జగన్.