KA Paul Pawan Kalyan : పాల్‌, ప‌వ‌న్ మ‌ధ్య రూ. 1000 కోట్ల `బైబిల్`

`త‌న‌ను తాను త‌గ్గించుకున్న‌ వాడు హెచ్చింప‌బ‌డును..` అనేది బైబిల్ సూక్తి. దాన్ని టీడీపీ, జ‌న‌సేన పొత్తుకు అన్వ‌యిస్తూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.

  • Written By:
  • Publish Date - June 7, 2022 / 12:28 PM IST

`త‌న‌ను తాను త‌గ్గించుకున్న‌ వాడు హెచ్చింప‌బ‌డును..` అనేది బైబిల్ సూక్తి. దాన్ని టీడీపీ, జ‌న‌సేన పొత్తుకు అన్వ‌యిస్తూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు. వాటి మీద ప్రజాశాంతి పార్టీ చీఫ్, ప్ర‌పంచ శాంతి దూత కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. హిందుత్వాన్ని వినిపిస్తోన్న బీజేపీతో చేతులు క‌లిపిన ప‌వ‌న్ బైబిల్ గురించి మాట్లాడ‌డం విడ్డూరం అంటూ పాల్ ధ్వ‌జ‌మెత్తారు. అంతేకాదు, రాజ‌కీయాల్లోకి బైబిల్ సూక్తుల‌ను ప‌వ‌న్ తీసుకురావడాన్ని ఆ మ‌తానికి సంబంధించిన ఫాస్ట‌ర్లు కూడా వ్య‌తిరేకిస్తున్నారు. హిందుత్వం కోసం పోరాడ‌తాన‌ని చెప్పిన ప‌వ‌న్ మీద క్రైస్త‌వులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌కీయానికి బైబిల్ సూక్తుల‌ను వాడుకోవ‌డానికి ప‌వ‌న్ ఎవ‌రంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయ‌న వినిపించిన బైబిల్ సూక్తి ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

బైబిల్ సూక్తిని వినిపించిన పవన్ కల్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్ర‌జాశాంతి పార్టీలోకి ఆహ్వానం పలికారు. తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తమ పార్టీలో చేరితే, ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపిస్తామని తాజాగా ఆఫ‌ర్ ఇచ్చారు. ఒకవేళ పవన్ ను గెలిపించలేకపోతే రూ. 1,000 కోట్ల నజరానా ఇస్తానని కూడా ఆయన ప్రకటించారు. పవన్ సొంతంగా పోటీ చేసినా, మరో పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా ఎన్నికల్లో గెలవలేడని పాల్ శ‌ప‌థం చేశారు. జ‌న‌సేన అభిమానుల‌కు , ప‌వ‌న్ కు ఇటీవ‌ల ఒక ఆఫ‌ర్ ఇచ్చిన పాల్ తాజాగా 1000 కోట్ల న‌జ‌రానా ప్ర‌క‌టించ‌డం ద్వారా బంప‌రాఫ‌ర్ ఇచ్చారు.

ప్ర‌జాశాంతి పార్టీలో చేరితే, రాబోవు రోజుల్లో సీఎంగా ప‌వ‌న్ ను చేస్తానంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ప‌వ‌న్ అభిమానుల‌కు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా పాల్ ఆహ్వానం ప‌లికారు. తాను ప్ర‌ధాన మంత్రి అవుతాన‌ని, అప్పుడు ప‌వ‌న్ కు ఏపీ సీఎం ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. ఇప్పుడు ఏకంగా జ‌న‌సేన పార్టీని వ‌దిలేసి వ‌స్తే 1000 కోట్లు ఇస్తాన‌ని ఆఫ‌ర్ పెట్టారు. అంతేకాదు, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌పున గెలిపిస్తాన‌ని హామీ ఇవ్వ‌డం జ‌న‌సేన‌కు ఏ మాత్రం మింగుడ‌ప‌డ‌డంలేదు. ప్ర‌జాశాంతి పార్టీలో మిన‌హా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా. ప‌వ‌న్ గెల‌వ‌డ‌ని పాల్ జోస్యం చెప్పారు.

ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్లో దాడి జ‌రిగిన త‌రువాత పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు శాపం పెట్టారు. మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఏమైందో, అదే జ‌రుగుతుంద‌ని కేసీఆర్ కు శాపం పెట్టిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ ఏ పార్టీతో పొత్తుకున్నా గెల‌వ‌డ‌ని శాపం పెట్టాడు. గ‌త కొన్ని రోజులుగా పాల్ ఇస్తోన్న ఆఫ‌ర్ల‌ను జ‌న‌సేన పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ప్ర‌జాశాంతి పార్టీ, జ‌న‌సేన రెండూ ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల మ‌ధ్య దూకుడుగా వెళుతోన్న పార్టీలు. ఆ రెండు పార్టీల చీఫ్ లు ఒకే సామాజిక‌వ‌ర్గం, ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు. దీంతో జ‌న‌సేన పార్టీని వ‌దిలిపెట్టి ప్ర‌జాశాంతి పార్టీకి ప‌వ‌న్ రావాల‌ని పాల్ భావిస్తున్నారు. ఆయ‌న ఆహ్వానంపై జ‌న‌సేన నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి రియాక్ష‌న్ లేదు. 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు న‌ర‌సాపురం కేంద్రంగా చేసిన హ‌ల్ చ‌ల్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్‌, నాగ‌బాబు, మెగా ఫ్యామిలీ గురించి పాల్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రువ‌లేనివి. మెగా కుటుంబంతో సాన్నిహిత్యం ఉంద‌ని ప్ర‌క‌టించారు. అందుకే, ఏపీని బాగుచేయ‌డానికి ఇద్ద‌రం క‌లుద్దామంటూ జ‌న‌సేనానికి పాల్ ఆహ్వానం పంపుతున్నార‌ట‌. ఆయ‌న ఆహ్వానానికి ఎప్పుడు జ‌న‌సైన్యం స్పందిస్తుందో చూడాలి.