మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు(Vallabhaneni Vamsi Arrest)తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య విమర్శలు తారస్థాయికి చేరాయి. టీడీపీ వంశీ అరెస్టును సరైన చర్యగా అభివర్ణిస్తుండగా, వైసీపీ దీన్ని కక్ష సాధింపు రాజకీయాలుగా పేర్కొంటోంది. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.
ఈ ఘటనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివికావని పేర్కొన్నారు. పాలనపై దృష్టి సారించాలని, అరెస్టుల ద్వారా ప్రజలను భయపెట్టాలనే ఆలోచన సరైనది కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెపుతారని బొత్స పేర్కొన్నారు.
Guinness World Record : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ఏపీ డ్వాక్రా మహిళలు యత్నం
అదే సమయంలో టీడీపీ నేత పట్టాభి దీనిపై తమ వాదనను వినిపించారు. బీసీ నేత దొంతు చిన్నపై వంశీ అనుచరులు దాడి చేశారని, ఆ ఘటనల వాహనాలను ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా, దాడికి గురయ్యామని, ఈ ఉదంతంలో వంశీ మద్దతుదారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని బెదిరించి, కిడ్నాప్ చేసి, బలవంతంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని ఆరోపించారు.
మరోపక్క వంశీ భార్య ఈ అరెస్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తమ ఇంటికి వచ్చి అరెస్టు చేశారని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే అరెస్టు చేయడం అన్యాయమని, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వేధిస్తున్నదని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికి వల్లభనేని వంశీ అరెస్టు ఏపీలో రాజకీయ దుమారాన్ని మరింత పెంచింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. మరి ఇది ఎప్పుడు కంట్రోల్ అవుతుందో చూడాలి.