Wanted Vijayawada YCP MP Candidate : బెజ‌వాడ వైసీపీకి ఎంపీ అభ్య‌ర్థి కావ‌లెను..?

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన వైఎస్ఆర్‌సీపీ బెజ‌వాడ ఎంపీ సీటుని మాత్రం గెలుచుకోలేక‌పోయింది.

  • Written By:
  • Updated On - August 6, 2022 / 04:20 PM IST

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన వైఎస్ఆర్‌సీపీ బెజ‌వాడ ఎంపీ సీటుని మాత్రం గెలుచుకోలేక‌పోయింది. 2014 ఎన్నిక‌ల్లో సైతం వైసీపీ ఈ సీటుని గెలుచుకోలేక‌పోయింది. ఈ రెండు ఎన్నిక‌ల్లో వేర్వేరు అభ్య‌ర్థులు వైసీపీ త‌రుపున పోటీ చేశారు. 2014 లో కోనేరు రాజేంద్ర‌ప్ర‌సాద్ పోటీ చేయ‌గా.. 2019 ఎన్నిక‌ల్లో పొట్లూరి వీర ప్ర‌సాద్‌(పీవీపీ) పోటీ చేసి ఓడిపోయారు. అటు టీడీపీ నుంచి రెండుసార్లు కేశినేని నాని పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ హవా కొన‌సాగిన‌ప్ప‌టికి ఆయ‌న విజ‌యం సాధించారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్తి అయిన‌ప్ప‌టికి విజ‌య‌వాడ వైసీపీ ఎంపీ స్థానానికి ఇంఛార్జ్ క‌రువైయ్యారు. ఇప్ప‌టి వ‌రకు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంఛార్జ్ లేకపోవ‌డంతో వైసీపీలో గంద‌రగోళం నెల‌కొంది.

2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పీవీపీ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మోహం చాటేశారు. అధికారంలో ఉన్నా కానీ ఆయ‌న పార్టీ కార‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. పార్లమెంట్ ప‌రిధిలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా కూడా పార్ల‌మెంట్ ఇంఛార్జ్ ఫోటో వేయ‌డంలేదు. విజ‌య‌వాడ‌లో సీఎం జ‌గ‌న్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ప్ప‌టికి పీవీపీ హాజ‌రుకావ‌డంలేదు. దీంతో ఆయ‌న్ని వైసీపీ పూర్తిగా ప‌క్క‌న పెట్టింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రిని పోటీ చేయించాలో అర్థంకాని ప‌రిస్థితి వైసీపీలో నెల‌కొంది. ఇప్ప‌టికి అభ్య‌ర్థి ఎంపిక‌పై వైసీపీ అధిష్టానం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంది.

విజ‌య‌వాడ లోక్‌స‌భ‌కు పోటీ చేయాలంటే ఖ‌ర్చుతో కూడుకున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. దాదాపు 100 కోట్ల‌కు పైనే ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అందుకోసం అంత ఆర్థికంగా బ‌ల‌ప‌డిన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకుతున్ప‌ప్ప‌టికి ఎవ‌రు ముంద‌కు రాని ప‌రిస్థితి.అయితే స్థానికంగా ప్ర‌స్తుతం పార్టీలో ఉండేవారినే ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టాల‌ని అధిష్టానం భావిస్తుంద‌ని స‌మాచారం. ఇందులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఇద్ద‌రు ముగ్గురు అభ్య‌ర్థుల్లో ఒక‌రిని ఎంపీగా పంపిచాల‌నే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తుంది. ఇటు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యేగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఇబ్బందిక‌ర పరిస్థితులు ఏర్ప‌డ్డాయి.

టీడీపీ నుంచి గెలిచి వైసీపీ కి వెళ్లిన వంశీకి … వైసీపీలో ఉన్న యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, దుట్టా రామ‌చంద్రరావుల వ‌ర్గాల నుంచి సహకారం అంద‌డంలేదు. వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నుంచి వ‌ల్ల‌భ‌నేని వంశీ తానే పోటీ చేస్తాన‌ని చెప్తున్న‌ప్ప‌టికి.. వైసీపీ అధిష్టానం మాత్రం యార్ల‌గ‌డ్డ వైపే మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. అయితే అదే స‌మ‌యంలో వ‌ల్ల‌భ‌నేని వంశీని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కి పోటీ చేయించాల‌నే ఆలోచ‌న‌లో వైసీపీ అధిష్టానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో వంశీ విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా పోటీ చేయాల్సి వ‌స్తే ఇటు టీడీపీ అభ్య‌ర్థిపై వంశీ గెలుపు క‌ష్ట‌మేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తానికి వైసీపీకి విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థి కావాలెను అనే బోర్డు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఆ పార్టీకి ఏర్ప‌డింది.