Site icon HashtagU Telugu

Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

Sankranti Private Travels

Sankranti Private Travels

సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్రాంతి సమయంలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి మొదలైంది.. అదేంటి నవంబర్‌లోనే సంక్రాంతి సందడి అనుకుంటున్నారా. అవును నవంబర్ నుంచే సంక్రాంతి కోసం జనాలు ప్రిపేర్ అవ్వాలి మరి. ప్రతి ఏటా నవంబర్ నెలలో జనవరి నెలకు సంబంధించిన రైల్వే, ఆర్టీసీ బస్సు టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. అలా టికెట్లు రిలీజ్ అవుతాయో, లేదో ఇలా హాట్‌ కేకుల్లా అయిపోతాయి. ఈ ఏడాది కూడా జనవరి నెల కోటా విడుదల కాగా.. కేవలం నిమిషాలు, గంటల వ్యవధిలోనే టికెట్లు బుక్ అయ్యాయి. చాలా వరకు వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయి.. ఆర్టీసీ బస్సుల్లో అయితే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. రైలు టికెట్లు, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు బుక్ కావడంతో జనాలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఛాన్స్ దొరికిందిలే అనుకుని ప్రైవేట్ ట్రావెల్స్ కూడా టికెట్ ధరల మోత మోగిస్తున్నాయి.

సంక్రాంతికి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే జనాలు ఎక్కువమంది ఉంటారు.. బెంగళూరు, చెన్నై నుంచి కూడా వెళుతుంటారు. ఆయా రూట్లలో బస్సు టికెట్లను అమాంతం పెంచేశారు.. ఏకంగా రూ.3వేలు, రూ.5వేలు చొప్పున ఆన్‌లైన్‌లో ధరలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిచ్చాయి. కొన్ని ట్రావెల్స్ రూ.3వేలు, కొన్ని ట్రావెల్స్ అంతకు మించి వసూలు చేస్తున్నాయి. అది కూడా ఇది నాన్ ఏసీ సీటు మాత్రమే కావడం విశేషం. అదే ఆర్టీసీలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళితే రూ.450 మాత్రమే. చెన్నై నుంచి విజయవాడకు అయితే ట్రావెల్స్ బస్సు టికెట్ ధర రూ.3500 వరకు ఉందంటున్నారు. ఈ ధరలపై ప్రైవేట్ ట్రావెల్స్‌ను ప్రశ్నించినా ఫలితం లేదు.. ఇంకా లేట్ చేస్తే ధరలు పెరుగుతాయనే భయంతో ముందే బుక్ చేసుకుంటున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ దెబ్బకు సంక్రాంతికి ఇంటికి వెళ్లాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం రూ.3వేల చొప్పున టికెట్ కొనుక్కుని వెళ్లడం ఆర్థికంగా భారమనే చెప్పాలి. నలుగురు ఉంటే ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసి ఊరు వెళ్లడం అవసరమా అని కొందరు ఆలోచిస్తుండగా.. కొందరు మాత్రం రూ.3వేలు అయినా సరే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి వెళితే పండగ ఖర్చు ఏమో కానీ.. ఈ ప్రయాణాల కోసం వేలకు, వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సంక్రాంతికి దాదాపు నెలన్నర సమయం ఉంది.. ముందే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరల్ని పెంచేశాయి. చాలామంది అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందేమోనని ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

వాస్తవానికి ఏపీఎస్‌ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ప్రతి ఏటా బస్సుల్ని నడుపుతుంది. కానీ ఆ బస్సులపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.. ఆర్టీసీ కూడా నవంబర్‌లోనే ప్రత్యేక సర్వీసులపై క్లారిటీ ఇస్తే బావుంటుంది అంటున్నారు. కానీ ఆర్టీసీ వచ్చే నెలలో ఈ బస్సులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.. అయితే ఆర్టీసీ డిమాండ్‌కు తగిన విధంగా ప్రత్యేకంగా బస్సు సర్వీసుల్ని నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంక్రాంతికి ఊరు వెళతారు బానే ఉంది.. మరి తిరుగు ప్రయాణం సంగతేంటనే భయం కూడా జనాల్ని వెంటాడుతోంది. మొత్తం మీద సంక్రాంతికి ఊరెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నవారికి ఇది బ్యాడ్‌న్యూస్.. ఈసారి ఊరెళ్లడం కష్టమేనా అంటూ జనాలు నీరసపడిపోతున్నారు.

Exit mobile version