ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గతంలో వైఎస్సార్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలను తన పార్టీకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కీలక నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Arun Kumar) కూడా వైసీపీలోకి రానున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికై, ఆ పార్టీకి మంచి వక్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2014 రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడారు. విభజనకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర హక్కుల అంశాలపై తన అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఉండవల్లి కొంతకాలం పాటు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ తరువాత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు జగన్ ఓటమి తో ఉండవల్లి వైసీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. బెంగళూరులో జరిగిన కీలక రాజకీయ చర్చల్లో ఉండవల్లి పేరు ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.
ఇప్పటికే వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీ వీడుతుండగా, మరికొందరు కొత్తగా పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు వైసీపీ బాటపడతారని చెబుతున్నారు. దశల వారీగా పార్టీలో చేరికలు కొనసాగుతాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో వైసీపీ కొత్త వ్యూహం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మరి ఉండవల్లి వైసీపీలోకి చేరతారా లేదా అనే విషయంపై ఇంకా ఆయన స్వయంగా స్పందించలేదు.