Site icon HashtagU Telugu

Vontimitta Sri Rama Kalyanam: ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం..!

Vontimitta Sri Rama Kalyanam

Vontimitta Sri Rama Kalyanam

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి, రాష్ట్ర‌ ప్రభుత్వం తరపున అదే రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇక రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కావొచ్చని అంచనా వేశామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకు ఈ సారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రకృతి ఇబ్బందులు తలెత్తినా భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా కల్యాణం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు.

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఇప్పటి వరకు సుమారు 63 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు. అవసరమైన మేరకు నిధులు వెచ్చించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఒంటిమిట్ట‌లో టీటీడీ 4.3 కోట్లతో నిర్మించిన భక్తుల వసతి సముదాయం, కార్యాలయాల సముదాయం, అతిథి గృహం యాత్రికుల వసతి సముదాయాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే మల్లిఖార్జునరెడ్డితో కలసి శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

ఇక బ్రహ్మోత్సవాలు, స్వామివారి కల్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వైవీ సుబ్బారెడ్డికి సంప్రదాయంగా స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్, కర పత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కల్యాణ ప్రాంగణాన్ని పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి అక్క‌డి అధికారులకు పలు సూచనలు చేశారు.

Exit mobile version