విశాఖపట్నంలోని ప్రసిద్ధ ఆర్కే బీచ్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్న విస్మయకర ఘటన సందర్శకులను ఆకట్టుకుంది. ఎప్పుడూ అలలతో ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గడం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. సముద్రం వెనక్కి వెళ్లడంతో సాధారణంగా నీటిలో మునిగిపోయే ప్రాంతాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందులో భారీ శిలలు, రాళ్లు మాత్రమే కాకుండా బ్రిటిష్ కాలం నాటి బంకర్ వంటి నిర్మాణం కూడా బయటపడటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని చూసిన పర్యాటకులు, స్థానికులు వెంటనే బీచ్ వైపు చేరుకొని ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.
Three-Wheeler Vehicles : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్.. త్రిచక్ర వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం
ఈ అసాధారణ ఘటనతో ఆర్కే బీచ్ వద్ద పర్యాటకుల సందడి మరింతగా పెరిగింది. సముద్రం వెనక్కి వెళ్లిన తరువాత బయటపడిన రాళ్లపైకి ఎక్కి యువత సాహసోపేతంగా ఫోటోలు, సెల్ఫీలు, వీడియో రీల్స్ తీశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ తీరం ప్రశాంత వాతావరణంలో మెరిసిపోగా, సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల తుఫాన్లు, అల్పపీడనాల ప్రభావంతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, ఇప్పుడు ప్రశాంతంగా మారడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. అయినప్పటికీ, ఈ దృశ్యం వెనుక గల భౌగోళిక కారణాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఈ పరిణామంపై సముద్ర శాస్త్ర నిపుణులు స్పందిస్తూ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్తీక పౌర్ణమి వంటి సమయంలో చంద్రుని ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల సముద్ర జలస్థాయిలో మార్పులు చోటుచేసుకోవడం సహజమని వారు చెప్పారు. వాతావరణ మార్పులు, సముద్ర అలల ఆటుపోట్ల వల్ల కొన్నిసార్లు నీరు కొంత వెనక్కి తగ్గి, తిరిగి ముందుకు రావడం సాధారణమేనని వివరిస్తున్నారు. ఇదే సమయంలో, తాజాగా ఆర్కే బీచ్ రోడ్‌లో ప్రారంభమైన “మాయా వరల్డ్” అద్దాల ఆకర్షణ కూడా సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ రెండు విశేషాలు కలిసిపోవడంతో ఆర్కే బీచ్ ప్రస్తుతం విశాఖలో అత్యంత చర్చనీయాంశంగా మారింది.
