Site icon HashtagU Telugu

Ganja : వైజాగ్‌లో డ్రగ్స్, గంజాయి ముఠాలపై పోలీసులు నిఘా.. త్వ‌ర‌లో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

Ganja

Ganja

ఏపీ గంజాయి, డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాపై పోలీసులు నిఘా పెట్టారు. ప్ర‌ధానంగా వైజాగ్ కేంద్రంగా డ్ర‌గ్స్‌, గంజాయి ముఠా అక్ర‌మ ర‌వాణా సాగిస్తుంది. వీరిపై పోలీసులు ప్ర‌త్యేక నిఘా పెట్టారు. మాదకద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌తలు చేప‌ట్టారు. కొత్త కమీషనర్‌గా ఆయ‌న బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. విశాఖపట్నం గంజాయి స్మగ్లర్లకు రవాణా కేంద్రంగా ఉందని, మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువ‌గా ఉందని గుర్తించారు. ఇప్పుడు ఏపీలో గంజాయిని ఎక్కువగా వినియోగించే నగరాల్లో విశాఖ‌ప‌ట్నం ఒక‌టిగా ఉంది. కాలేజీలు, యూనివ‌ర్సిటీ విద్యార్థ‌లే టార్గెట్‌గా స్మ‌గ్ల‌ర్లు గంజాయి, డ్ర‌గ్స్ ర‌వాణా చేస్తున్నారు.

నగరంలోని ఎంట్రీ పాయింట్ల వద్ద టాస్క్‌ఫోర్స్ స్నిఫర్ డాగ్‌లను ఉంచుతుందని కమిషనర్ ర‌విశంక‌ర్ తెలిపారు. పేలుడు పదార్థాలను గుర్తించేందుకు శిక్షణ పొందిన కుక్కలకు అదనంగా గంజాయి, డ్రగ్స్‌ను పసిగట్టేందుకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏఎస్‌ఆర్ జిల్లా, ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైజాగ్‌కి గంజాయి నిత్యం అక్రమంగా తరలివ‌స్తుంద‌ని సీపీ తెలిపారు. రైళ్లు, రహదారి మార్గాల్లో తనిఖీలు పెరిగిన తరువాత.. స్మగ్లర్లు ఇప్పుడు ఒడిశా నుండి ఆంధ్ర సరిహద్దులో ఉన్న న‌దులు ద్వారా అక్ర‌మ ర‌వాణా చేస్తున్నార‌ని సీపీ తెలిపారు.