Viveka : వివేకా కేసు విచార‌ణాధికారి ఔట్‌, అవినాష్ సేఫేనా?

వివేకా(Viveka) హ‌త్య కేసులో విచార‌ణ సాగ‌దీత మీద సుప్రీం కోర్టు కూడా

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 04:38 PM IST

మాజీ మంత్రి వివేకా(Viveka) హ‌త్య కేసులో విచార‌ణ సాగ‌దీత మీద సుప్రీం కోర్టు (Supreme Court)కూడా విసిగిపోయింది. అందుకే, సీబీఐ విచార‌ణ‌కు డెడ్ లైన్ పెట్టింది. వ‌చ్చే నెల 30వ తేదీ లోపు విచార‌ణ ముగించాల‌ని ఆదేశించింది. ప్ర‌స్తుతం విచార‌ణాధికారిగా ఉన్న రామ్ సింగ్ ను తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ద‌ర్యాప్తుకు. ఆరుగురు స‌భ్యుల‌తో కూడిన సిట్ ను సుప్రీం కోర్టు నియ‌మించడం గ‌మ‌నార్హం.

వివేకా  హ‌త్య  కేసులో సీబీఐ విచార‌ణ‌కు డెడ్ లైన్ (Viveka)

సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలోని కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. స‌భ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేశ్ కుమార్, ఇన్ స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్ స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉంటారని పేర్కొంది. వివేకా(Viveka) హత్య కేసు దర్యాప్తు నుంచి ప్రస్తుత విచారణ అధికారి రామ్ సింగ్ ను తప్పించినట్టు కోర్టు వెల్ల‌డించింది. వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఆరు నెలల్లోపు ట్రయల్ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్ కు అవకాశం ఉంటుందని, అప్పుడు సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశాల ప్రభావం బెయిల్ పిటిషన్ పై ఉండబోదని, అర్హతలను బట్టే బెయిల్ పై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.

విచార‌ణాధికారిగా ఉన్న రామ్ సింగ్ ను తొల‌గిస్తూ..

నాలుగేళ్ల క్రితం జ‌రిగిన మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తు అంతులేని క‌థ మాదిరిగా జ‌రుగుతోంది. విచార‌ణ అధికారుల మీద ఒకానొక సంద‌ర్భంలో నిందితులుగా ఉన్న వాళ్లు కేసులు పెట్టారు. కొన్ని వంద‌ల మందిని విచారించారు. కానీ, వివేకా (Viveka) హ‌త్యలోని హంత‌కుల‌ను గుర్తించ‌లేక‌పోయింది. సీబీఐ విచార‌ణ అవ‌స‌రంలేదంటూ ఏపీ ప్ర‌భుత్వం కోరింది. దాని స్థానంలో సిట్ ద్వారా విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌య‌త్నం చేసింది. అలాంటి ప‌రిస్థితుల్లో సుప్రీం కోర్టుకు వివేకా నంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత వెళ్లారు. సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. ఆ మేర‌కు సీబీఐ విచార‌ణ‌కు సుప్రీంకోర్టు (Supreme Court)ఆదేశించింది. రెండున్న‌రేళ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ద‌ర్యాప్తు ముందుకు క‌ద‌ల్లేదు. దీంతో ఏపీ ప‌రిధి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ద‌ర్యాప్తును సుప్రీం మార్చేసింది. ఆ త‌రువాత ద‌ర్యాప్తు వేగ‌వంతం అయిన‌ట్టు క‌నిపించింది. హ‌త్య కేసులో సూత్ర‌ధారిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ క‌డ‌ప ఎంపీ అవినాష్ ను తేల్చింది. మూడుసార్లు సీబీఐ ఆ కోణం నుంచి విచార‌ణ చేసింది. కానీ, అరెస్ట్ మాత్రం చేయ‌లేక‌పోయింది.

Also Read : YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సంచలన పరిణామం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

వివేకానంద‌రెడ్డి (Viveka)హ‌త్య కేసు విచార‌ణ తాత్సారంపై సుప్రీం కోర్టు ప‌లుమార్లు అస‌హ‌నం వ్య‌క్త‌ప‌రిచింది. అయిన‌ప్ప‌టికీ సీబీఐ ఏదో ఒక కార‌ణం చెబుతూ ఇప్ప‌టి వ‌ర‌కు నెట్టుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం సుప్రీం కోర్టు(Supreme Court) ఆగ్ర‌హం వ్య‌క్త‌ప‌రిచింది. ద‌ర్యాప్తు అధికారిని మార్చేసింది. ఏప్రిల్ 30వ తేదీలోపు హ‌త్య కేసు విచార‌ణ ముగించాల‌ని డెడ్ లైన్ పెట్టింది. ఈసారైనా అవినాష్ అరెస్ట్ త‌ప్ప‌దా? లేక ముంద‌స్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేసిన అవినాష్ త‌ప్పించుకుంటారా? అనేది ఉత్కంఠ క‌లిగించే అంశం.

Also Read : YS Viveka Murder : జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత ట్వీట్‌.. వివేక మ‌ర‌ణించి నేటికి నాలుగేళ్లు