Site icon HashtagU Telugu

Viveka Murder case : వివేకా హ‌త్య క‌థకు నాలుగేళ్ల చ‌రిత్ర‌

Viveka Murder case

Viveka Cbi

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు(Viveka Murder case) విచార‌ణ ఫైన‌ల్ కు చేరింది. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని(Avinash Reddy) అరెస్ట్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ విష‌యాన్ని ఆయ‌నే చెబుతున్నారు. సీఆర్పీసీ 160 నోటీసులు సీబీఐ ఇచ్చింద‌ని, అరెస్ట్ చేయ‌డానికి సిద్ద‌మ‌యింద‌ని నిర్థారించుకున్నారు. అందుకే, ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు ప‌రిచారు. విచార‌ణ‌కు చీఫ్ జ‌స్టిస్ అనుమ‌తించారు. అందుకే, కోర్టు డైరెక్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు విచార‌ణ‌కు రానంటూ సీబీఐకి సందేశం పంపారు. అంటే, ఏదో ట్విస్ట్ నెల‌కొంద‌ని వివేకా హ‌త్య కేసును మొద‌టి నుంచి ఫాలో అవుతున్న వాళ్లు భావిస్తున్నారు.

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు(Viveka Murder case)

అనూహ్యంగా ఆదివారం భాస్క‌ర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయ‌న్ను చంచ‌ల్ గూడ్ జైలుకు పంపింది. గుగూల్ టేకౌట్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో భాస్క‌ర్ రెడ్డి, అవినాష్ రెడ్డి(Avinash Reddy) అక్క‌డే ఉన్నారు. అంతేకాదు, హ‌త్య‌కు (Viveka Murder case)సంబంధించిన ఆధారాల‌ను లేకుండా చేశార‌ని తొలి నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఆ రోజున అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన లీడ‌ర్లు కూడా గొడ్డ‌లి పోటును గుర్తు చేస్తున్నారు. హ‌త్య జ‌రిగింద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ గుండెపోటుగా సొంత మీడియా ద్వారా ఎందుకు ప్ర‌చారం చేశారు? అనేది టీడీపీ వేస్తోన్న సూటి ప్ర‌శ్న‌. హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశాన్ని క్లీన్ చేయ‌డంతో పాటు వివేకా మృతదేహానికి కుట్లు కూడా వేయ‌డం జ‌రిగింది. ఇదంతా ద‌గ్గ‌రుండి అవినాష్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి చేయించార‌ని సీబీఐ అనుమానిస్తోంది.

తెలంగాణ ప‌రిధిలోకి కేసు విచార‌ణ

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు న‌వీన్, ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్ రెడ్డిని కూడా ఇటీవ‌ల సీబీఐ విచారించింది. తాడేప‌ల్లి కోట‌లోని ప‌లువున్ని అనుమానించింది. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు సీబీఐ విచార‌ణ కోరిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రాగానే వ‌ద్దంటూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం ప‌లు అనుమానాల‌ను రేకెత్తించింది. ఒకానొక సంద‌ర్భంగా సీబీఐ అధికారుల మీద కేసులు పెట్టే ప‌రిస్థితికి ఏపీ పోలీస్ వ‌చ్చింది. దీంతో తెలంగాణ ప‌రిధిలోకి కేసు విచార‌ణ మారింది. అయిన‌ప్ప‌టికీ కేసు విచార‌ణ ఆల‌స్యం అవుతోంది. దీంతో సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టి విచార‌ణాధికారులను ప్ర‌త్యేకంగా నియ‌మించింది. దీంతో ఈ కేసు విచార‌ణ క్లైమాక్స్ కు చేరింద‌ని భావిస్తోన్న వాళ్లు అనేకులు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య (Viveka Murder case )జ‌రిగింది. హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌తో ఇప్పుడు వైఎస్సార్‌సీపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది.

హ‌త్య, ఆ త‌రువాత ప‌రిణామాలు (Avinash Reddy)

మార్చి 15, 2019 హత్య జరిగిన రోజు నుండి పరిణామాల మలుపు..ఈ హత్య (Viveka Murder case) వెనుక కుట్రను స్పష్టం చేస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇంకా పూర్తి రహస్యాన్ని విప్పలేదు. దీంతో వివేకా హత్య కేసు ఎలాంటి మలుపులు తిరుగుందనే దానిపై సర్వత్రా టెన్సన్ రేకెత్తిస్తోంది.బాబాయ్‌ హత్య వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి హస్తం ఉందని ఆరోపిస్తూ అప్పటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటల తూటాలు పేల్చడంతో అప్పటి అధికార పార్టీ టీడీపీని ఇరుకున పడింది. అయితే నాలుగేళ్ల తర్వాత, సిఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కొనసాగుతున్న దర్యాప్తుతో 2019లో టిడిపి పరిస్థితే తాజాగా వైసీపీకి వచ్చి పడింది.

టీడీపీ కుట్రలో భాగంగానే  బాబాయిని హత్య చేశారని జగన్ (Viveka Murder case)

వివేకానంద‌ రెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో తన ఇంటిలో రక్తపు మడుగులో శవమై కనిపించారు. శరీరంపై తీవ్రగాయాలు ఉన్నప్పటికీ గుండెపోటుతో సహజ మరణంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అంచనా వేశారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మార్చి 15, 2019 సాయంత్రం వివేకానంద రెడ్డి (Viveka Murder case ) కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి పులివెందులకు చేరుకున్నప్పుడు మరిన్ని వివరాలు బయటకు రావడం ప్రారంభించాయి. ఆ సమయానికి, నేరానికి సంబంధించిన ఆనవాళ్లు చాలా వరకు మాయమయ్యాయి. వివేకానంద రెడ్డిని పదునైన వస్తువుతో నరికి చంపినట్లు నిర్ధారణ అయిన తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ దుమారం మొదలైంది. రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలో భాగంగానే తన బాబాయిని హత్య చేశారని జగన్ ఆరోపించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటిషన్ కూడా వేశారు.

Also Read : Viveka Murder Case : నేడు సీబీఐ విచార‌ణ‌కు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి.. అరెస్ట్ చేసే ఛాన్స్‌..?

ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ ఎక్కడా జరగలేదు. ఈలోగా, ఎన్నికలు ముగిశాయి. వైఎస్‌ఆర్‌సిపి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆసక్తికరంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ సీబీఐ విచారణ కోసం తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సిట్‌ను పునరుద్ధరించారు.అయినా విచారణలో ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత, వివేకానంద రెడ్డి(Viveka Murder case ) భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ సునీత, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హత్య జరిగిన దాదాపు ఏడాది తర్వాత 2020 మార్చిలో సీబీఐతో విచారణకు హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తుకు సమయం తీసుకుంది. ఈ కేసులో భాగంగా 2021లో షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, జి ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలను అరెస్టు చేశారు. వివేకానంద రెడ్డికి మాజీ డ్రైవర్ అయిన దస్తగిరి తరువాత అప్రూవర్‌గా మారారు. అతని వాంగ్మూలం, సేకరించిన ఇతర ధృవీకరించే సాక్ష్యాల ఆధారంగా, సిబిఐ తుమ్మ గంగిరెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురి పేర్లతో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, నిందితులు కోర్టుల నుండి ఉపశమనం పొందేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. సిబిఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై వారు ఫిర్యాదులు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి దర్యాప్తు మందగించింది. ఆంధ్రప్రదేశ్‌లో అనేక అడ్డంకులు ఏర్పడుతున్నందున కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేసును తెలంగాణకు బదిలీ చేసింది.

ట్విస్టులతో వివేకా హత్య కేసు (Avinash Reddy)

తాజాగా వైఎస్‌ భారతి మేనమామ, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి (72)ని సీబీఐ అధికారులు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో అరెస్టు చేశారు. పులివెందుల భాకరాపురంలోని భాస్కరరెడ్డి నివాసానికి వేకువజామునే చేరుకున్న సీబీఐ బృందం తొలుత సోదాలు చేసి, ఆయన్ను అదుపులోకి తీసుకుంది. వివేకా హత్య, నేరపూరిత కుట్ర, ఆధారాల ధ్వంసం తదితర అభియోగాల కింద నమోదైన కేసులో భాస్కరరెడ్డిని అరెస్టు చేసినట్లు సీబీఐ అదనపు ఎస్పీ ముకేష్‌కుమార్‌ అరెస్టు మెమోలో ప్రకటించారు. భాస్క‌ర్ రెడ్డి వద్ద రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి ఫ్లైట్‌ మోడ్‌లో ఉందని మెమోలో తెలిపారు. అనంతరం భాస్కరరెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌ తరలించి, సీబీఐ జడ్జి ఇంటివద్ద హాజరుపరిచారు. వివేకా హత్యకు వైఎస్‌ భాస్కరరెడ్డి మరికొందరితో కలిసి కుట్ర చేసి… దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా అమలు చేయించారనేది సీబీఐ ప్రధాన అభియోగం. హత్య తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించేందుకు వీలుగా ఘటనా స్థలంలో ఆధారాలన్నీ ధ్వంసం చేయించారని సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసింది.

భాస్కరరెడ్డిని పది రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌

కడపలో భాస్కరరెడ్డిని అరెస్టు చేశాక సీబీఐ అధికారులు ఆయనను తొలుత హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం క్యాజువాలిటీలో తొలుత ఈసీజీ, 2డీ ఎకో, రక్తపోటు, మధుమేహం, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. రక్తపోటు కొంత ఎక్కువగా ఉండటంతో మాత్రలు ఇచ్చారు. సుమారు గంటపాటు పరీక్షలు చేశాక, సాయంత్రం 4.35 గంటల సమయంలో మాసాబ్‌ట్యాంక్‌లోని సీబీఐ జడ్జి నివాసంలో హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల రిమాండు విధించడంతో చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. వివేకా హత్య వెనక ఉన్న భారీకుట్రను వెలికితీసేందుకు భాస్కరరెడ్డిని పది రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌ దాఖలుచేసింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. వైఎస్‌ భాస్కరరెడ్డి ఆదేశాల మేరకే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య(Viveka Murder case ) జరిగిందని సీబీఐ వెల్లడించింది. భారీగా సొమ్ము ఎర వేయడం ద్వారా సహనిందితులైన తన అనుచరులతో హత్యకు నెల రోజుల ముందే ఆయన పథకరచన చేశారంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి తర్వాత పొడచూపిన విభేదాలే హత్యకు నేపథ్యంగా తేలినట్లు తెలిపింది.

హత్యాస్థలిలో ఆధారాల్ని చెరిపేసేందుకూ భాస్కరరెడ్డి బృందం(Viveka Murder case)

తమ అనుచరుల ద్వారా కీలకసాక్షుల్ని ప్రభావితం చేయడానికి, హత్యాస్థలిలో ఆధారాల్ని చెరిపేసేందుకూ భాస్కరరెడ్డి బృందం ప్రయత్నించిందని పేర్కొంది. దర్యాప్తునకు భాస్కరరెడ్డి సహకరించకపోగా.. తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. దర్యాప్తునకు అందుబాటులోకి ఉండకపోవడం, సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు, పారిపోయేందుకు ఆస్కారం ఉండటం వల్ల ఆయనను జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంచాలని విజ్ఞప్తి చేసింది. వివేకా హత్యకు(Viveka Murder case) సంబంధించి దర్యాప్తులో తాము గుర్తించిన అంశాలను, అందులో భాస్కరరెడ్డి పాత్రను రిమాండు రిపోర్టులో వివరంగా ప్రస్తావించింది.వైఎస్‌ భాస్కరరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు.. ఆయన భార్య వైఎస్‌ లక్ష్మికి తెలిపారు. ఆమె నుంచి సాక్షి సంతకం తీసుకున్నారు. భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తుండగా… ఆయన అనుచరులు ఆ వాహనాల్ని అడ్డుకునేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించి భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు తరలించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి(Avinash Reddy) తన తండ్రి అరెస్టు విషయం తెలుసుకుని హుటాహుటిన పులివెందులకు చేరుకున్నారు. తొలుత తన తల్లి లక్ష్మితో మాట్లాడారు. అనంతరం పులివెందులలో అనుచరులతో సమావేశమయ్యారు.

Also Read : YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సంచలన పరిణామం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

వివేకా హత్య కేసులో (Viveka Murder case) సీబీఐ ఇప్పటివరకూ ఏడుగురిని నిందితులుగా గుర్తించి, వారిలో నలుగురిని అరెస్టు చేసింది. తాజాగా వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్టుతో.. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 5కు చేరింది. ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి (అప్రూవర్‌), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డిలను ఇప్పటివరకూ నిందితులుగా గుర్తించింది. వీరిలో గంగిరెడ్డి, దస్తగిరి మినహా మిగతావారంతా జైల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా భాస్కరరెడ్డి కస్టడీ నివేదికలో వైఎస్‌ అవినాష్‌రెడ్డినీ(Avinash Reddy) సహనిందితుడిగా పేర్కొనడంతో.. ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లయింది. తాజాగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ అనుమతించింది. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్‌ స్పష్టం చేసింది.

Also Read : Avinash Reddy vs CBI: తాడేపల్లికి సీబీఐ సెగ, అవినాష్ అరెస్ట్ కు కౌంట్ డౌన్?