Minister Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనువైన అపార అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం కారణంగా ప్రాజెక్టులకు రికార్డు సమయంలో ఆమోదం లభిస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యుత్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (AIBC) ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
అనుభవజ్ఞుల నాయకత్వం, వేగవంతమైన విధానాలు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల ముఖ్య కారణాలను మంత్రి వివరిస్తూ.. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వం, ప్రభుత్వంలో యువతరం ఉత్సాహం, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రధానమని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ వంటి పెద్ద ప్రాజెక్టును కేవలం 13 నెలల్లోనే పూర్తి చేశామని, ఆర్సెల్లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ గ్రౌండింగ్‌ను 15 నెలల్లో చేశామని ఉదాహరణలిచ్చారు. మూడు రోజుల్లోనే ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తున్నామని, గత 16 నెలల్లో రాష్ట్రానికి రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.
Also Read: Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!
ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖ
విశాఖపట్నాన్ని ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. విశాఖపట్నం అంటే తనకు ఎంతో ప్రేమ అని, అది బెంగుళూరు (టెక్/అభివృద్ధి), గోవా (పర్యాటకం/సౌందర్యం)ల మేళవింపు లాంటిదని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గూగుల్ ప్రకటన తర్వాత విశాఖలో కొత్త ఉత్సాహం వచ్చిందని, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీ, ఆస్ట్రేలియా మధ్య స్కిల్ డెవలప్‌మెంట్, అగ్రిటెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫార్మా, స్టీల్ వంటి రంగాల్లో సహకారానికి అవకాశాలు ఉన్నాయని లోకేష్ వివరించారు. రాష్ట్రాలు పోటీపడితేనే భారత్ గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.