సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు సన్నద్ధమయ్యారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంక్రాం తి పండుగ సమయంలో కోడిపందాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంక్రాంతి కోడిపందాలు జరుగుతాయి. నర్సీపట్నం, నాతవరం, కోటౌరట్ల, రావికమతం కసింకోట ప్రాంతాల్లో ఈ పందాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడి పోలీసులు కూడా అప్రమత్తమైయ్యారు. గత సంవత్సరం జిల్లా పోలీసులు దాదాపు 40 కేసులు నమోదు చేశారు. 100 మందికి పైగా కోడి పందాల నిర్వాహకులను, పందెం రాయుళ్లను అరెస్టు చేశారు.పందాల కోసం తెచ్చిన 50 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఏడాది విశాఖ పోలీసులు కోడిపందాలపై ప్రచారం కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లా పోలీసులు ఇప్పటికే అనేక మంది నిర్వాహకులను కట్టడి చేశారు.
ఇప్పటికే దాదాపు 200 మంది నిర్వాహకులను.. పందెంరాయుళ్లను కట్టడి చేశామని విశాఖపట్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి. కృష్ణారావు తెలిపారు. అనేక మంది కీలక నిర్వాహకులను కట్టడి చేయడమే కాకుండా, పండుగకు కొన్ని రోజుల ముందు జిల్లా పోలీసులు అవగాహన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కోడిపందాలను ప్రధానంగా నిర్వహించే గ్రామాలు, పట్టణాల్లో తమ బృందాలు తిరుగుతూ కోడిపందాలు నిర్వహించకుండా నిరోధించాలనే ఉద్దేశంతో వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం వంటి ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో అంతగా లేకపోయినా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం అనూహ్యంగా కోడిపందాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ ముందు తరువాత నాలుగు ఐదు రోజుల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని పోలీసులు అంటున్నారు.
పందెం వేసే కోడిపుంజులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఒక్కొక్క కోడిపుంజు రూ. 15,000 నుండి రూ. 50,000 వరకు ఉంటుంది. వీటిని ఏడాది నుంచే సేకరించి..వాటికి జీడిపప్పు, బాదంపప్పు తో పాటు మంచి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని అందిస్తారు. అందుకోసమే వీటికి అంత రేటు ఉంటుంది. మొత్తానికి ఈ ఏడాది కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోడి పందాలపై పోలీసులు ఇప్పటి నుంచే ఉక్కుపాదం మోపుతున్నారు.