Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRC) ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటికే జనరల్ కన్సల్టెన్సీ నియామకం కోసం బిడ్లను ఆహ్వానించడం, తద్వారా సాంకేతిక, ప్రణాళికా అంశాల్లో ముందడుగు వేసింది. కూటమి ప్రభుత్వం అక్టోబర్ 2025 నాటికి మెట్రో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, అధికార యంత్రాంగాన్ని స్పష్టమైన సమయపట్టికతో ముందుకు నడిపిస్తున్నారు.
తొలిదశ లక్ష్యం – 46.23 కి.మీ.లో మూడు కారిడార్లు
ఈ మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో దాదాపు రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన కారిడార్లలో 42 స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు..
కారిడార్ 1: స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు (34.40 కి.మీ., 29 స్టేషన్లు)
కారిడార్ 2: గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు (5.07 కి.మీ., 6 స్టేషన్లు)
కారిడార్ 3: తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75 కి.మీ., 7 స్టేషన్లు)
ఈ మూడు కారిడార్లకు అవసరమైన 98 ఎకరాల భూమిని గుర్తించి, భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రాధాన్యతతో ప్రారంభించింది. జిల్లాలోని సంబంధిత అధికారులు ఇప్పటికే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పలు ఆర్థిక సంస్థలతో రుణాల కోసం సంప్రదింపులు జరుపుతూ, 100 శాతం నిధులను సమకూర్చేందుకు కేంద్రాన్ని కూడా కోరినట్లు సమాచారం.
విశాఖ నుంచి 2026 నాటికి అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ కల్పించడం ప్రణాళికలో భాగంగా ఉంది. దీని కోసం విశాఖ మెట్రో రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) ఇప్పటికే 15 కీలక రహదారులను గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ మెట్రో ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది – డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మాణం. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 20.07 కి.మీ. పొడవులో దీనిని ప్రతిపాదించారు. కింద రహదారి, మధ్య ఫ్లైఓవర్, ఆ పై మెట్రో ట్రాక్ ఉండే విధంగా నిర్మించబోయే ఈ స్ట్రక్చర్ ఆసియాలోనే అత్యంత పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా నిలవనుంది.
విశాఖపట్నం ఆర్థికంగా, పారిశ్రామికంగా, ఐటీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టు అత్యవసరం. ఇది నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా, పర్యావరణహితమైన రవాణా వ్యవస్థను అందించనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర రూపురేఖలు మార్చబోతున్నాయని, జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తమవుతోంది.