Visakha Metro Rail: ఏపీలో మెట్రో రైలు కూత వినిపించనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే మెట్రో రైలు ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతుండగా, ఏపీ ప్రభుత్వం కూడా మెట్రో రైలు సదుపాయాన్ని కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది. తాజాగా, వైజాగ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో మెట్రో రైలు లైన్ ఏర్పాటు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే, అదే విధంగా వైజాగ్‌లోనూ మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై వైజాగ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం అనేక పరిశ్రమలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందిన నగరం. అయితే, రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది, ఇది నగర ప్రజలకు ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. నగర జనాభా కూడా పెరుగుతుండటంతో, రవాణా వ్యవస్థకు సంబంధించి సమస్యలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో, వైజాగ్ అభివృద్ధి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని, మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.
వ్యయం ఇలా..
మొదటి దశ ప్రాజెక్టు మొత్తం 46.23 కి.మీ. పరిధిలో అమలవుతుంది. ఇందులో మూడు కారిడార్లు ఉంటాయి. ఈ కారిడార్లలో మొత్తం 42 రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.11,498 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది.
- కారిడార్-1: స్టీల్‌ప్లాంటు – కొమ్మాది
- కారిడార్-2: గురుద్వారా – పాత పోస్టాఫీసు
- కారిడార్-3: తాటిచెట్లపాలెం – చినవాల్తేరు
మూడు కారిడార్ల నమూనా:
- కారిడార్-1
స్టీల్‌ప్లాంటు, వడ్లపూడి, శ్రీనగర్, చినగంట్యాడ, గాజువాక, ఆటోనగర్, బీహెచ్‌పీవీ, షీలానగర్, విమానాశ్రయం, కాకానినగర్, ఎన్‌ఏడీ, మాధవధార, మురళీనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, వెంకోజిపాలెం, హనుమంతువాక, ఆదర్శనగర్, జూ పార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది. - కారిడార్-2
గురుద్వారా – పాత పోస్టాఫీసు (5.08 కి.మీ.): స్టేషన్లు: 6
ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్సు, డాబాగార్డెన్స్, సరస్వతీపార్క్, పూర్ణామార్కెట్, పాతపోస్టాఫీసు. - కారిడార్-3
తాటిచెట్లపాలెం – చినవాల్తేరు (6.75 కి.మీ.): స్టేషన్లు: 7
రైల్వే న్యూకాలనీ, రైల్వే స్టేషన్, అల్లిపురం కూడలి – ఆర్టీసీ కాంప్లెక్సు, సంపత్ వినాయగర్ ఆలయం, సిరిపురం, ఏయూ, చినవాల్తేరు.
ఈ మూడు కారిడార్ల నిర్మాణానికి 99.75 ఎకరాలు భూమి సమీకరించబడతాయి. దీని కోసం రూ.882 కోట్లు ఖర్చవుతాయని అంచనా.
త్వరితగతిన: మెట్రో ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయడానికి నిర్ణయం తీసుకుని, మొదటి దశ పనులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తోంది. మొదటి దశలో సవరించిన మార్పులను కేంద్రానికి సమర్పించామనిమెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.