ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) రైలు దహనం కేసు (Tuni Train Burning Case)లో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును కొట్టివేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కేసును సక్రమంగా విచారించనందుకు రైల్వేకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత సున్నితమైన అంశాన్ని ఐదేళ్లు ఎందుకు లాగారని సూటిగా ప్రశ్నించింది.
విచారణ ప్రక్రియలో రైల్వే పోలీసులు నేరం రుజువు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విజయవాడ రైల్వే కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేరని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును కొట్టివేస్తూ తీర్పును తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు కులస్తులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ సాధన కోసం అప్పటి తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో కొందరు దుండగులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైలు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ సమయంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read: Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి సందర్భంగా 44 ప్రత్యేక రైళ్లు
దీంతో రైలు దహనం కేసులో రైల్వే పోలీసులు 41 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా ప్రస్తుత మంత్రి దాశెట్టి రాజా, సినీ నటుడు జీవీ సహా 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 20 మంది విచారణకు హాజరుకాగా.. ఐదుగురు తమకేమీ తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసు శాఖ, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లో నమోదైన పలు కేసులను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. RPF కేసు పెండింగ్‌లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 146, 147, 153, 174 (ఎ), (సి) కింద కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు సుదీర్ఘ వాదనల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.