విజయవాడ రాజకీయాల్లో వర్గపోరు టీడీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. గతంలో టీడీపీలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దేవినేని ఉమామహేశ్వరావుల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉండేది. వర్గపోరుతో వారు విసిగి పోయి చివరకు పార్టీ మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని నాని పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత రెండోసారి పార్టీ అధికారంలో రాకపోయిన రాష్ట్రం మొత్తంలో గెలిచిన మూడు ఎంపీ సీట్లో విజయవాడ ఒకటిగా ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క సీటు మాత్రమే టీడీపీ గెలిచిన విజయవాడ ఎంపీ సీటుని మాత్రం కేశినేని నాని సునాయసనంగా గెలిచారు.
వైసీపీ హవాలోనూ ఎంపీగా గెలవడం మాములు విషయం కాదని.. ఆయన చేసిన అభివృద్ధి, టాటా ట్రస్ట్ కార్యాక్రమాలే ఆయన్ను గెలిపించాయని టీడీపీ క్యాడర్ గుర్తు చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడం.. ఎంపీగా కేశినేని నాని గెలవడంతో జిల్లా టీడీపీలో ఆయన కీలకంగా మారారు. అధినేత చంద్రబాబు కూడా ఎంపీ నానికి కీలక బాధ్యతలు అప్పగిస్తుండటంతో మళ్లీ వర్గపోరుని కొంతమంది సీనియర్ నేతలు తెరమీదకు తీసుకువచ్చారు.
2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా టీడీపీ నేతలు వర్గాలను పెంచిపోషించుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కృష్ణాజిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాలో సైతం వైసీపీ పాగా వేయడం.. నాయకుల మధ్య వర్గపోరు ప్రధాన కారణంగా వినిపిస్తుంది. ఓడిపోయినప్పటికి జిల్లా నేతల తీరు ఏ మాత్రం మారడం లేదు. విజయవాడ పార్లమెంట్ లో ఎంపీగా ఉన్న కేశినేని నానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెరమీదకు తీసుకువచ్చారు. చిన్నికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గం ఆయా నియోజకవర్గాల్లో సహకరిస్తున్నారు. వీరంతా ప్రత్యక్షంగా కనిపించనప్పటికీ వారి అనుచరవర్గంతో నియోజకవర్గాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు.
అయితే ఇదంతా జరగుతున్న ఎంపీ కేశినేని నాని విషయంలో మాత్రం అధినేత చంద్రబాబు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మాస్ ఇమేజ్‌తో పాటు నిబద్ధత కలిగిన కార్యకర్తగా పేరున్న కేశినేని నానిని చంద్రబాబు వదులుకోదలుచుకోలేదు. ఆగష్టు 15న రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి కేశినేని నానిని అధినేత చంద్రబాబు తన కారులో తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా చంద్రబాబు కారులోనే కేశినేని నాని వెళ్లారు. దీంతో వారిద్ధరి మధ్య గ్యాప్ లేదని స్పష్టమవుతుంది. నాని ముక్కుసూటితనంతో కొన్ని సందర్భాల్లో ఆయన విమర్శలు చేసినప్పటికీ విజయవాడ పార్లమెంట్‌లో నాని మాస్ ఇమేజ్‌తో పార్టీ బలంగా ఉందని అధిష్టానం నమ్మింది. ఎదిఎమైనప్పటికి ఎంపీ కేశినేని నాని విషయంలో చంద్రబాబు క్లారిటీతో ఉన్నారనేది కనపిస్తుంది.