Durga Temple : 70 సంవత్సరాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా చండీ దేవిగా దుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్స‌వాలు అంగ‌రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ

Published By: HashtagU Telugu Desk
Durga Temple

Durga Temple

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్స‌వాలు అంగ‌రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. 70 ఏళ్ల చ‌రిత్ర‌లో చండీ దేవిగా అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఇది తొలిసారి అని ఆల‌య అధికారులు తెలిపారు. చండీ దేవి అలంకారంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రారంభ‌మైంది. ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిధ్ది ఉందని వేదపండితులు చెబుతున్నారు. అమ్మవారు మహచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం… ఏ కోర్కెల కోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. భ‌క్తుల ర‌ద్దీ నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌టిష్ట ఏర్పాట్లు చేశారు. రేపు అమ్మ‌వారి జన్మ న‌క్ష‌త్రం(మూల న‌క్ష‌త్రం) కావ‌డంతో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తారు. ఈ నేప‌థ్యంలో రేపు వీఐపీ ద‌ర్శ‌నాల‌ను ఆల‌య అధికారులు ర‌ద్దు చేశారు.

Chandi devi

  Last Updated: 19 Oct 2023, 11:03 AM IST