YCP : గ‌డ‌ప‌గ‌డ‌ప‌కి ప్రోగ్రాం స‌క్సెస్‌తో దూకుడు పెంచిన వైసీపీ యువ‌నేత‌.. టీడీపీ కంచుకోట బ‌ద్ధ‌ల‌య్యేనా..?

వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ప్ర‌క‌టించింది.

  • Written By:
  • Updated On - July 31, 2022 / 09:06 AM IST

వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ప్ర‌క‌టించింది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కి మ‌న ప్ర‌భుత్వం అంటూ ఎమ్మెల్యేలు అంతా జ‌నంలోకి వెళ్లాల‌ని కార్య‌చ‌ర‌ణ ఇచ్చింది. అయితే ఈ కార్య‌క్ర‌మంలో చాలాచోట్ల ఎమ్మెల్యేల‌కు అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. ఇచ్చిన హామీల‌పై ప్ర‌జ‌లు ఎమ్మెల్యేల‌ను, నేత‌ల్ని నిల‌దీస్తున్నారు. ఇటు మ‌రికొన్ని చోట్ల మాత్రం నేత‌ల‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. టీడీపీ గెలిచిన స్థానాల్లో ఉన్న ఇంఛార్జ్లు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.

Devineni Avinash

ఇటు టీడీపీ కంచుకోట‌గా ఉన్న కృష్ణాజిల్లాలో 2019 ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్లో మాత్ర‌మే వైసీపీ ఓట‌మి పాలైంది. జిల్లాలోని గ‌న్న‌వ‌రంతో పాటు, విజ‌య‌వాడ న‌గ‌రంలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ విజ‌యం సాధించింది. 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గ‌ద్దె రామ్మోహ‌న్ , వైసీపీ అభ్య‌ర్థిగా బొప్ప‌న భ‌వ‌కుమార్ బ‌రిలోకి దిగారు. బొప్ప‌న భ‌వ కుమార్ మాత్రం గ‌ద్దె రామ్మోహ‌న్‌కి ధీటుగా పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. అయితే ఈ సారి ఎలాగైన టీడీపీని విజ‌య‌వాడ ఈస్ట్‌లో ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం భావించింది. అందులో భాగంగానే జిల్లాలో బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ని విజ‌య‌వాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్‌గా నియ‌మించింది. అప్ప‌టి నుంచి దేవినేని అవినాష్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు.

అవినాష్ ఇంఛార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ఎక్కువ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. డిప్యూటీ మేయ‌ర్-1 సైతం తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి ద‌క్కింది. దీంతో కార్పోరేష‌న్ ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌ర‌వర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేయ‌డంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం నిధుల‌తో కూడా సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల క‌ల‌గా మిగిలి ఉన్న కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణ ప‌నులు జోరుగా సాగుతున్నాయి.

Devineni Avinash

ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్లో ప్ర‌తిరోజు ఏదో ఒక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ దేవినేని అవినాష్ జ‌నంలోనే ఉంటున్నారు. దేవినేని నెహ్రూ చారిట‌బుల్ ట్ర‌స్ట్ పేరుతో ప‌లువురికి తోపుడు బండ్లతో పాటు ఆర్థిక స‌హాయం అందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు నిత్యం కార్యాల‌యంలో అందుబాటులో ఉంటూ సమ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నారు. ఇటు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కి మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా ప్ర‌క‌టిచంక‌ముందే అవినాష్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు

తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని అవినాష్ ఇంఛార్జ్‌గా వ‌చ్చాక టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా యాక్టీవ్ అయ్యారు. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా టీమ్ ని పెట్టుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పెడుతూ ప‌బ్లిసిటీ చేసుకుంటున్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని అవినాష్‌కు బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటున్నారు. ఎలాగైన ఈ సారి ఎన్నిక‌ల్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌ని అవినాష్ ఉవ్విళ్తురుతున్నారు.

Devineni Avinash

గ‌త ప్ర‌భుత్వం హాయంలో చేసిన అవినీతిని నిత్యం ప్ర‌స్తావిస్తూ… త‌న ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధిస్తున్నారు. అయితే త‌న సొంత పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి కూడా తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఆశిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ప్రస్తుతం య‌ల‌మంచిలి ర‌వి యాక్టీవ్ గా లేక‌పోవడం ఆయ‌కు మైన‌స్‌గా ఉంది. ఒక‌వేళ అవినాష్‌ని ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే య‌ల‌మంచిలి ర‌వికి మ‌రేదైనా ప‌ద‌వి ఆఫ‌ర్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ కంచుకోట‌గా ఉన్న విజ‌య‌వాడ తూర్పు నియోజ‌కవర్గంలో వైసీపీ పాగా వేస్తుందా లేదో వేచి చూడాల్సిందే.