Site icon HashtagU Telugu

Chandrababu – CID Custody : రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు

Chandrababu – CID Custody : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం కీలక ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుతో ముడిపడిన వ్యవహారాలపై మరింత సమాచారాన్ని సేకరించేందుకు చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబును కనీసం ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా.. కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

Also read : Mohammad Hafeez: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కలకలం.. వరల్డ్ కప్ కు ముందు పీసీబీకి మహ్మద్ హఫీజ్ రాజీనామా..!

వాస్తవానికి సీఐడీ కస్టడీ పిటిషన్ పై బుధవారం (సెప్టెంబరు 20న) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వాదనలు జరిగాయి. వాస్తవానికి ఆరోజే సాయంత్రం తీర్పును ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ జడ్జి గురువారం ఉదయానికి వాయిదా వేశారు. తర్వతా సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉన్నందున మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నరకు న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చే ఛాన్స్‌ ఉందని న్యాయవాదులు చెప్పడంతో తీర్పును  2.30 గంటలకు వాయిదా వేశారు. చివరకు హైకోర్టు కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఏసీబీ కోర్టు కూడా సీఐడీ కస్టడీపై తీర్పును వెలువరించింది. చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది.