Vijayasai Reddy : విజయసాయిరెడ్డి.. వచ్చే వారమే బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు పూర్తయ్యాయని అంటున్నారు. ఈ ఏడాది జనవరి 25న వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన విజయసాయి.. ఇక వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేను’’ అని చెప్పారు. అంటే కచ్చితంగా భవిష్యత్తులో ఏదో ఒక పార్టీలో ఉంటారని తేలిపోయింది. అది కచ్చితంగా బీజేపీయే అని అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఆయనకు ఆ పార్టీలోనే పెద్దస్థాయి వరకు అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Also Read :Upasana : HCU అటవీ భూములపై వివాదం.. స్పందించిన రామ్ చరణ్ భార్య..
మూడు నెలలు గ్యాప్ ఇచ్చి..
వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశాక కనీసం మూడు నెలలు గ్యాప్ ఇచ్చి, మరో పార్టీలో చేరితే బాగుంటుందని విజయసాయి భావించి ఉండొచ్చు. అందుకే ఈ నెలలోనే ఆయన కమలదళం కండువాను కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ లేదా జులైలో బీజేపీలో చేరాలని విజయసాయి అనుకున్నారట. అంత సుదీర్ఘ గ్యాప్ వల్ల చాలా అవకాశాలు చేజారుతాయని తెలుసుకొని.. ఆయన అలర్ట్ అయ్యారట. కాస్త తొందరపడితేనే కొన్ని రాజకీయ ప్రయోజనాలను అందుకోవచ్చని విజయసాయి డిసైడయ్యారట. విజయసాయి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం భర్తీకి ఈనెల (ఏప్రిల్)లోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అందుకే ఇదే సరైన సమయమని ఆయన భావించారట. ఈ టైంలో బీజేపీలో చేరి, రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారట. ఈనెల 4న పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే బీజేపీలో చేరిక కోసం విజయసాయి కసరత్తు మొదలుపెట్టొచ్చు.
కాకినాడ సీపోర్టు వ్యవహారమూ కారణమేనా ?
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని మార్చి రెండోవారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు?, బలవంతంగా లాక్కున్నారా?, బలవంతంగా తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంతనే విషయాలను సాయిరెడ్డి నుంచి సీఐడీ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఉదయం 11 నుంచి దాదాపు 3:30 గంటలపాటు సాయిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బహుశా ఈ వ్యవహారం కూడా విజయసాయిని బీజేపీలో చేరిక దిశగా నడిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
విజయసాయిరెడ్డి చేరికతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ(Vijayasai Reddy) పెద్దలు భావిస్తున్నారట. ఏపీలోని ఉత్తరాంధ్ర రాజకీయాలపై విజయసాయికి మంచి పట్టు ఉంది. అక్కడి నుంచి వైఎస్సార్ సీపీ కీలక నేతలను బీజేపీలోకి లాగేందుకు విజయసాయి తమకు సాయం చేస్తారని కమలదళం అగ్రనేతలు అనుకుంటున్నారు. రెడ్డి వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలను బీజేపీకి చేరువ చేసే మాధ్యమంగా విజయసాయి ఉంటారని భావిస్తున్నారు.