Vijay Sai Reddy : తెలుగు మీడియా వార్‌! సాయి రెడ్డి టీవీ ఛాన‌ల్ ప్ర‌క‌ట‌న‌!!

మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నాన‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న వైసీపీలో సంచ‌ల‌నంగా మారింది

  • Written By:
  • Updated On - October 11, 2022 / 03:03 PM IST

మీడియా రంగంలోకి అడుగు పెడుతున్నాన‌ని ఎంపీ విజ‌య‌ సాయి రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న వైసీపీలో సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ (సాక్షి మీడియా సంస్థ) ఆ పార్టీకి సొంతం. కానీ, మ‌రో మీడియా సంస్థ‌ను ప్రారంభిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వైసీపీలో నెంబర్ 1గా ఉన్న జ‌గ‌న్ నెంబ‌ర్ 2గా ఉన్న సాయిరెడ్డిల మ‌ధ్య ఏదైనా జ‌రిగిందా? అనే అనుమానం కలుగుతోంది.

టీవీ ఛానల్ ను పెట్టబోతున్నానని మీడియా స‌మావేశంలో సాయి రెడ్డి అధికారంగా ప్ర‌క‌టించారు. `తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదని, ఏ మీడియా రంగంలో అయితే రామూ (రామోజీరావు) ఉన్నారో , అదే రంగంలోకి తాను ప్రవేశించబోతున్నాను. మీ ఛానల్ ఎలా పనిచేస్తుందో, తాను పెట్టబోయే ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందాం రామూ ` అంటూ సవాల్ విసిరారు. మీ రంగంలోకి తాను ఎంటర్ కాబోతున్నానని ప్ర‌క‌టించారు. అయితే, కేవ‌లం రామోజీరావుకు పోటీగా మాత్ర‌మే వ‌స్తున్నాన‌ని ఆయ‌న చెప్ప‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది.

విశాఖ భూ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయ‌న‌కు వ్యతిరేకంగా ఇటీవ‌ల రామోజీ మీడియా ప‌లు క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది. తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడుతూ రామోజీరావుపై విమర్శలు గుప్పించారు. పేపర్, టీవీ ఉందనే కదా రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అందుకే ఆయ‌న‌కు పోటీ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. స‌రిగ్గా ఇక్క‌డే ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

రెండేళ్లుగా విజ‌య‌ సాయి రెడ్డి, జ‌గ‌న్ మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. విశాఖ కేంద్రంగా చేసుకుని ఆయ‌న చాలా కాలం పాటు రాజ‌కీయాలు న‌డిపారు. ఆయ‌న సీక్రెట్స్ ను చూపే ఒక వీడియో ఏదో ఉంద‌ని ఒక మీడియా పుకార్లు చేసింది. బ‌య‌ట పెడ‌తామ‌ని కూడా బెదిరించింది. కానీ, ఆ వీడియో తాలూకూ గాసిప్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు వ‌చ్చాయిగానీ నిజ‌మైన వీడియో ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఆ త‌రువాత తాడేప‌ల్లి కేంద్రంగా జ‌రిగిన పంచాయ‌తీ క్ర‌మంలో విశాఖ వైసీపీ రాజ‌కీయం నుంచి త‌ప్పుకున్నారు. ఉత్త‌రాంధ్ర కో ఆర్డినేట‌ర్ గా వైవీ సుబ్బారెడ్డిని నియ‌మించారు. దీంతో రాజ్య‌స‌భ కూడా రెండోసారి సాయిరెడ్డికి రాద‌ని పుకార్లు పుట్టించారు. కానీ, రెండోసారి రాజ్య‌స‌భ అవ‌కాశం ఇస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు.

మూడు రాజ‌ధానుల అంశం వెనుక విశాఖ‌లో భూ కొనుగోళ్ల వ్య‌వ‌హారం సాయి రెడ్డి వ్య‌వ‌హారం ఉంద‌ని చాలా కాలంగా ఒక వ‌ర్గం మీడియా క‌థ‌నాల‌ను అందిస్తోంది. ఇటీవ‌ల వాటి గురించి మ‌రింత ప్రాచుర్యంలోకి తీసుకురావ‌డంతో పాటు ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం లింకుల‌ను కూడా జోడించ‌డం జ‌రిగింది. దీంతో ఉక్కిబిక్కిరి అవుతోన్న సాయిరెడ్డికి అండ‌గా సాక్షి మీడియా నిల‌బ‌డ‌లేదు. దీంతో ప్ర‌త్య‌ర్థి మీడియాను ఎదుర్కోవ‌డానికి సొంత మీడియా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న భావించిన‌ట్టు ఉన్నారు.

వాస్తంగా సాక్షి మీడియాకు ముందు తెలుగు జ‌ర్న‌లిజంలో ఒక వ‌ర్గానికి చెందిన‌దే పైచేయిగా ఉండేది. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి పవ‌ర్ లోకి రావ‌డానికి బాగా ఉపయోగ‌ప‌డింది. ఆ మీడియా లేక‌పోతే ఆయ‌న ఉనికే ఉండేది కాద‌ని చాలా మంది వైసీపీ వాళ్లు న‌మ్ముతారు. ఆ పార్టీలోని కొంద‌రు మీడియా పెట్ట‌డానికి ముందుకొచ్చిన‌ప్ప‌టికీ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకున్నార‌ని ఏడాది క్రితం ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు విజ‌య‌ సాయి రెడ్డి మీడియాలోకి అడుగుపెట్ట‌డం రామోజీకి వ్య‌తిరేకంగానా? లేక జగన్ మోహన్ రెడ్డి మీద పైచేయి సాధించ‌డానికా? అనే మ‌రో చ‌ర్చ కూడా బ‌య‌లు దేరింది. ఏదేమైన‌ప్ప‌టికీ మీడియా రంగంలో మ‌రో విప్ల‌వం రాబోతుంద‌ని సాయి రెడ్డి సంకేతం ఇవ్వ‌డం వైసీపీలో క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది.