Vijay Sai Reddy: కాంగ్రెస్‌-వైసీపీ పొత్తుపై `వీసా` సిగ్న‌ల్‌

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి. సీఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు. బ‌హుశా జ‌గ‌న్ కు తెలిసిన ప్ర‌తి విష‌యం విజ‌య‌సాయిరెడ్డికి కూడా తెలిసే ఉంటుంది.

  • Written By:
  • Updated On - April 23, 2022 / 12:51 PM IST

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి. సీఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు. బ‌హుశా జ‌గ‌న్ కు తెలిసిన ప్ర‌తి విష‌యం విజ‌య‌సాయిరెడ్డికి కూడా తెలిసే ఉంటుంది. అందుకే, ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను జ‌గ‌న్ చెప్పేవిగానే భావిస్తుంటారు. తాజాగా కాంగ్రెస్‌, వైసీపీ పొత్తుపై ప‌రోక్షంగా విజ‌య‌సాయిరెడ్డి జై కొట్టారు. పొత్తు అంశాన్ని ఆయ‌న దృష్టికి మీడియా తీసుకెళ్లిన‌ప్పుడు జ‌గ‌న్ మాత్ర‌మే దాని గురించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెప్పారు. పొత్తు విష‌యాన్ని ఖండించ‌కుండా జ‌గ‌న్ మాత్ర‌మే దాని గురించి చెప్ప‌గ‌ల‌ర‌ని ప‌రోక్షంగా కాంగ్రెస్‌, వైసీపీ కూట‌మికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఆ రెండు పార్టీల‌ పొత్తు గురించి చ‌ర్చ జ‌రుగుతోంది.

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మాత్రం పొత్తు అంశాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీగా వైసీపీని ఫోక‌స్ చేశారు. అంతేకాదు, సోనియా కుటుంబాన్ని రాజ‌కీయంగా భూస్థాపితం చేయ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్యంగా చెప్పుకొచ్చారు. ఆ పార్టీకి చెందిన మిగిలిన లీడ‌ర్లు ఎవ‌రూ పొత్తు అంశంపై నోరుమెద‌ప‌లేదు. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ సంద‌ర్భంగా సోనియా వ‌ద్ద వైసీపీతో పొత్తు గురించి ప్ర‌స్తావించార‌ని టాక్‌. అయితే, ఆ విష‌యాన్ని పీకే మాత్రం ధ్రువీక‌రించ‌డంలేదు. నిప్పులేనిది పొగ‌రాద‌న్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి కాంగ్రెస్‌, వైసీపీ పొత్తు అంశం గుప్పుమంది. దీంతో ఊహాగానాల‌కు తెర‌లేసింది.

ప్ర‌త్యేక‌హోదా కోసం ఏ పార్టీతోనైనా పొత్తుకు జ‌గ‌న్ సై అంటున్నారు. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ వాయిస్ ను వినిపించారు. ఆయ‌నపై విశ్వాసం ఉంచిన ఏపీ ఓట‌ర్లు 22 మంది ఎంపీల‌ను వైసీపీకి ఇచ్చారు. కానీ, ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మాత్రం నోరుమెద‌ప‌లేని ప‌రిస్థితి జ‌గ‌న్ కు వ‌చ్చింది. ఆయ‌న మీద ఉన్న కేసులు, వైసీపీ అవ‌స‌రం కేంద్ర ప్ర‌భుత్వానికి లేక‌పోవ‌డం తదిత‌ర కార‌ణాల‌తో హోదాను అడిగే ధైర్యం కూడా జ‌గ‌న్ చేయ‌లేక‌పోతున్నారు. పైగా జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ చాలా క‌ష్టం అయింది. రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కూడా అప్ప‌ట్లో భంగ‌ప‌డి తిరిగి వ‌చ్చారు. ఆ త‌రువాత ఏదో నామ్ కేవ‌స్తేగా అపాయిట్మెంట్లు ఇచ్చిన‌ప్ప‌టికీ గౌర‌వం మాత్రం జ‌గ‌న్‌కు ఇవ్వ‌డంలేద‌నేది ఢిల్లీ వ‌ర్గాల వినికిడి.

ప్ర‌తి సంద‌ర్భంలోనూ బీజేపీకి అనుకూలంగా జ‌గ‌న్ న‌డుచుకుంటున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక విష‌యంలోనూ ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు అనువుగా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా మ‌రో రాజ్య‌స‌భ సీటును ఆదానీ గ్రూప్ కోసం జ‌గ‌న్ పై ఒత్తిడి పెంచార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఢిల్లీకి పిలిపించుకుని జ‌గ‌న్ పై ప‌లు విధాలుగా బీజేపీ ఒత్తిడి చేసింద‌ని టాక్‌. అందుకే, మ‌ధ్యేమార్గంగా బీజేపీని వ‌దిలించుకోవాల‌ని వైసీపీ భావిస్తుంద‌ని తెలుస్తుంది. అంతేకాదు, బీజేపీ ముద్రకు దూరంగా 2024 ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. తెలంగాణ సీఎం కూడా ప్ర‌ధాని మోడీ పాల‌నను టార్గెట్ చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్నారు. ఆ క్ర‌మంలో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. అలాంటి పంథానే జ‌గ‌న్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎంచుకోవాల‌ని స్కెచ్ వేస్తున్నార‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌కావ‌డంతో పాటు మోడీ పై ఉన్న వ్య‌తిరేక‌త అస్త్రంగా మ‌రోసారి సీఎం కావాల‌ని జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఆ మేర‌కు పీకే వ్యూహం ర‌చించార‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌.

జాతీయ స్థాయిలో కీ రోల్ పోషించ‌లేక‌పోతే, ప్ర‌జ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌త్యేక‌హోదా అసాధ్యం. అందుకే, హోదా ఇస్తానంటోన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు క‌నీసం 8శాతం ఉంద‌ని పీకే స‌ర్వే సారాంశం. ఆ శాతాన్ని క‌వ‌ర్ చేయాలంటే కాంగ్రెస్‌, క‌మ్యూనిస్ట్ ల మ‌ద్ధ‌తు అవ‌స‌ర‌మ‌ని పీకే ఇచ్చిన క్లూ గా చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మిగా వెళ్లే అవ‌కాశం ఉంది. ఆ కూట‌మిని ఎదుర్కొవాలంటే ఈసారి వైసీపీకి కూడా మ‌రో కూట‌మి అవ‌స‌ర‌మ‌ని పీకే ఇచ్చిన స‌ల‌హాగా వినిపిస్తోంది. ఆ దిశ‌గా పీకే ఇప్ప‌టికే సోనియా వద్ద పావులు క‌దిపార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి కూడా కొట్టిపారేయ‌డంలేదు. ఫ‌లితంగా రాబోవు రోజుల్లో మ‌ళ్లీ సోనియా గూటికి జ‌గ‌న్ వెళ‌తార‌ని వైసీపీలోని కొంద‌రు ఫిక్స్ అవుతున్నారు.