Jayaprada : జ‌య‌ప్ర‌దంగా తెలుగుదేశంలోకి..?

తెలుగుదేశం పార్టీతో వెట‌ర‌న్ హీరోయిన్ జ‌య‌ప్ర‌దకు విడ‌దీయ‌రాని సాన్నిహిత్యం ఉంది. రాజ‌కీయాల్లో ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 01:38 PM IST

తెలుగుదేశం పార్టీతో వెట‌ర‌న్ హీరోయిన్ జ‌య‌ప్ర‌దకు విడ‌దీయ‌రాని సాన్నిహిత్యం ఉంది. రాజ‌కీయాల్లో ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ. ఒకప్పుడు తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలి హోదాలో పార్టీకి సేవ‌లు అందించారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబుకు అధికార‌మార్పిడి జ‌రిగిన ఎపిసోడ్లో ఆమె కీల‌క రోల్ పోషించార‌ని ఇప్ప‌టికీ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ ఉంది. ఆ త‌రువాత ఆమె ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కేంద్ర‌బిందువు అయ్యారు. ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు ఎస్పీ పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు. అయితే, ప్ర‌స్తుతం మారిన రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో తిరిగి టీడీపీకి గూటికి జ‌య‌ప్ర‌ద చేరుకోబోతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ తో క‌లిసి హిట్ సినిమాల‌ను అందించిన హీరోయిన్ గా జ‌య‌ప్ర‌ద‌కు పేరుంది. ఆ ప‌రిచ‌యాల‌తో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె రాజ్య‌స‌భ ప‌ద‌విని పొందే వ‌ర‌కు ఎదిగారు. ఆ త‌రువాత యూపీ రాజ‌కీయాల్లోకి వెళ్లి ఏపీ వైపు చూడ‌లేదు. కానీ, ఎస్పీలోని కీల‌క నేత అంజాద్ ఖాన్ రూపంలో ఆమెకు ఇటీవ‌ల రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. దీంతో పూర్వ‌పు ప‌రిచ‌యాలు ఉన్న చంద్ర‌బాబును ఇటీవ‌ల జ‌య‌ప్ర‌ద ఆశ్ర‌యించార‌ని తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమెను పార్టీలోకి తీసుకుంటే ఎంతో కొంత ఉప‌యోగం ఉంటుంద‌ని బాబు అండ్ టీమ్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకు బ‌లం చేకూరేలా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి అవార్డు ఈసారి ఆమెకు వ‌రించింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలను టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ సినిమా ‘జగదేకవీరుని కథ’ సినిమాతో పరిచయమై, ఆయనతో కలిసి పలు జానపద .. పౌరాణిక చిత్రాలలో నటించిన ఎల్. విజయలక్ష్మిని ఎన్టీఆర్ శతజయంతి అవార్డుతో సత్కరించి, బంగారు పతకం అందజేశారు. తెనాలిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె అమెరికా నుంచి వచ్చి, హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత కాలంలో ఎన్టీ రామారావుతో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన జయప్రదను కూడా ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు.

శ్రీదేవి తరువాత దక్షిణాది నుంచి వెళ్లి నార్త్ లోను తన జోరు చూపించిన హీరోయిన్ ఆమె. ఇక రాజకీయాలలోను ఆమె తనదైన మార్కును చూపించారు. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన జయప్రదకు, ఈ నెల 27వ తేదీన తెనాలిలోని ఎన్వీ ఆర్ కన్వెన్షన్ లో ఎన్టీఆర్ అవార్డును, బంగారు పతకం అందజేయనున్నారు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ వేదిక ముగిసిన త‌రువాత జ‌య‌ప్ర‌ద మ‌లివిడ‌త రాజ‌కీయ ప్ర‌యాణంపై క్లారిటీ వ‌స్తుంద‌ని ఆమె అభిమానులు భావిస్తున్నారు. రాజ‌మండ్రి నుంచి ఆమెను ఎంపీగా దింప‌డ‌మా? లేక పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఉప‌యోగించుకుని రాజ్య‌స‌భ‌ను ఇవ్వ‌డ‌మా? అనే దానిపై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎలాంటి ఫుల్ స్టాప్ ఈ ప్ర‌చారానికి ప‌డుతుందో చూడాలి.