Venkaiah Naidu : రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య ?

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు రాష్ట్ర‌ప‌తి కాబోతున్నాడ‌ని ఉద‌యం నుంచి కొన్ని సోష‌ల్ మీడియా గ్రూప్ లో న్యూస్ వైర‌ల్ అవుతోంది.

  • Written By:
  • Updated On - March 29, 2022 / 01:26 PM IST

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు రాష్ట్ర‌ప‌తి కాబోతున్నాడ‌ని ఉద‌యం నుంచి కొన్ని సోష‌ల్ మీడియా గ్రూప్ లో న్యూస్ వైర‌ల్ అవుతోంది. కొద్దిసేప‌టి క్రిత‌మే రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌నాయుడిని అభ్య‌ర్థిగా బీజేపీ నిల‌బెడుతుంద‌ని టెస్ట్ మెసేజ్ లు వాట్స‌ప్ గ్రూప్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నేష‌న‌ల్‌, ప్రాంతీయ మీడియాల్లో ఎక్కడా ఆ వార్త మాత్రం క‌నిపించ‌డంలేదు. కానీ, ప్ర‌త్యేకించి తెలుగుదేశం సానుభూతి గ్రూప్ ల‌లో రాష్ట్ర‌ప‌తి మెసేజ్ వైరల్ కావ‌డం గ‌మనార్హం.ప్రస్తుతం ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ గా వెంక‌య్య‌నాయుడు కొన‌సాగుతున్నాడు. మ‌రో రెండు నెల‌ల్లో ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగుస్తోంది. అదే స‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు కూడా మ‌రో నెల రోజుల్లోనే రానున్నాయి. అందుకు సంబంధించి కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల్లో ఆశించిన ఫ‌లితాలు రావ‌డంతో రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని బీజేపీ నిల‌ప‌నుంది. అయితే, ప్రాంతీయ పార్టీల మ‌ద్ధ‌తు లేకుండా రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్యర్థుల‌ను బీజేపీ గెలుపించుకునే ప‌రిస్థితి లేదు.

దేశంలోని 29 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు స‌గం యూపీయే కూట‌మిలోని పార్టీల‌కు ఉంది. ప్ర‌ధానంగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వైసీపీ, టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ధ‌తు అవ‌స‌రం. ఆ రెండు పార్టీలు మ‌ద్ధ‌తు ఇస్తే. బీజేపీ నిలిపే అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశం ఉంది. ఆ కోణంలో వెంక‌య్య‌నాయుడిని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా నిలిపితే, ఏపీ, తెలంగాణ‌లోని అన్ని పార్టీలు మ‌ద్ధ‌తు ఇస్తాయ‌ని బీజేపీ ఆలోచ‌న‌ట‌. తెలుగు వాడిగా ఆయ‌నకు టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ తో పాటు ద‌క్షిణ భార‌త ఈక్వేష‌న్లో డీఎంకే, కేర‌ళ రాష్ట్రంలోని క‌మ్యూనిస్ట్ లు కూడా మ‌ద్ధ‌తు ఇస్తార‌ని అంచ‌నా వేస్తోంది. అందుకే, ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం వెంక‌య్య‌నాయుడు పేరు ఆమోద‌యోగ్యంగా బీజేపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. పైగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, జ‌గ‌న్‌, కేసీఆర్ కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు.ఇంకా అధికారికంగా వెంక‌య్య‌నాయుడు పేరు ఫైన‌ల్ కాకుండానే కొన్ని సోష‌ల్ మీడియా గ్రూప్ లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌డం తిక‌మ‌క పెడుతోంది. ఆ మెసేజ్ లు నిజ‌మా? అబ‌ద్ధ‌మా? అంటూ అనేక మంది ప‌ర‌స్ప‌ర తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ లు చేసుకుంటూ ప్ర‌స్తావిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విప‌క్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ విష‌యాన్ని ప‌రోక్షంగా బెంగాల్ సీఎం మ‌మ‌త ఇటీవ‌ల వెల్ల‌డించింది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు అనుకూలంగా లేకపోవడంతో కాంగ్రెస్ ముంద‌డుగు వేయ‌డానికి ఆలోచిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, DMK, శివసేన, తెలంగాణ రాష్ట్ర సమితి త‌దిత‌ర‌ ప్రాంతీయ పార్టీలు ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని పెట్టాలా? వ‌ద్దా? అనే కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. రాజసభ నేతగా ఆజాద్ పదవీకాలం పూర్తయ్యాక తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మోదీ.. సభలోనే కంటతడి పెట్టాడు. అప్పుడే వారి మధ్య రాజకీయబంధం ఎంత బలంగా ఉందో అన్ని పార్టీలకు అర్థమైంది.గులాంనబీ ఆజాద్ కు ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. ఆయ‌న్ను రాష్ట్ర‌ప‌తిగా బీజేపీ ప్ర‌తిపాదించే అవ‌కాశం ఉంద‌ని యూపీ పోలింగ్ ముందు జాతీయ మీడియా యూపీ ఎన్నిక‌ల‌కు ముందు ఫోక‌స్ చేయ‌డాన్ని గ‌మ‌నిస్తే కమ‌ల‌నాథుల వ్యూహం ఏమిటో ఒక ప‌ట్టాన అర్థం కావడంలేదు.ఇటీవ‌ల జాతీయ స్థాయి ఫ్రంట్ అంటూ నిన‌దించిన కేసీఆర్ తెర వెనుక ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అవ‌స‌ర‌మైన మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇటీవ‌ల మ‌ద్ధ‌తుగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ పుట్టుక‌పై మాట్లాడిని హ‌ర్యానా సీఎంపై కేసీఆర్ ఫైర్ అయ్యాడు. రాహుల్ ఇటీవ‌ల చేసిన ప్ర‌సంగాల‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నాడు. ఇవ‌న్నీ చూస్తూంటే కేసీఆర్ ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం అంటూ భావించిన వాళ్లు లేక‌పోలేదు.

రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కోసం ఎలక్టోరల్ కాలేజీలలో ఉభయ సభలకు చెందిన 776 మంది ఎంపీలు ఉంటారు. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,120 మంది ఎమ్మెల్యేలు ఓట‌ర్లుగా ఉంటారు. మొత్తంగా ఎలక్టోరల్ కాలేజీలో 1,098,903 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి కావాలంటే క‌నీసం 549,452 ఓట్లను సంపాదించాలి. ఆయా రాష్ట్రాల్లోని ఓట్ల‌ విలువ విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 83,824 ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుసు.ఎన్టీయే, యూపీయేత‌ర పార్టీలు క‌లిసి అభ్య‌ర్థిని నిలిపితే విప‌క్ష శిబిరంలోని ఓట్లు చీలిపోయే ప్ర‌మాదం ఉంది. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు చేతులు కలిపి ఉమ్మడి అభ్యర్థిని పెట్టినట్లయితే యూపీఏలో విభేదాలు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఫ‌లితంగా బిజెపి నిలిపే అభ్యర్థి గెలిచే అవ‌కాశం మెండుగా ఉంటుంది. అలా కాకుండా వెంక‌య్యానాయుడు లాంటి వాళ్ల‌ను ఎంపిక చేస్తే ఈజీగా గెలుపు సాధ్యం అవుతుంద‌ని బీజేపీలోని కొంద‌రి అంచ‌నా.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషించే అవ‌కాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ను క‌లుపుకుంటే 200 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అంటే, దాదాపు సగం ఎలక్టోరల్ కాలేజీలు రాష్ట్రపతి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నికలలో కీలకం అవుతాయి. ద‌క్షిణ భార‌త దేశం నుంచి రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వుల్లో ఏదో ఒక‌టి ఉండే అవ‌కాశం ఉంది. ఆర్ఎస్ఎస్ ప‌ట్టుబ‌డితే, అద్వానీకి కూడా ఛాన్స్ ఉండే అవకాశం లేక‌పోలేదు. ఇక ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని ద‌క్షిణ భార‌త దేశానికి ఇస్తే ప్ర‌ధమంగా కేసీఆర్ పేరు వినిపించేలా ఆయ‌న ఫోక‌స్ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి కేసీఆర్ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టిస్తే.. ఏపీ, త‌మిళ‌నాడు, బెంగాల్‌, మ‌హారాష్ట్ర సీఎంలు మ‌ద్ధ‌తు ప‌లుకుతార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపిస్తోన్న ముఖ‌చిత్రం. రేసులోకి నితీష్ కూడా వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది.

రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు ఈ ఏడాది జూలైలో జ‌ర‌గ‌బోతున్నాయి. వాటి కంటే ముందుగా మార్చి 31న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తారు. తాజాగా వ‌చ్చిన ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాజ్యసభపై పట్టును బీజేపీకి మరింత పెంచింది. భారత రాష్ట్రపతిని 776 మంది పార్లమెంటేరియన్లు మరియు 4,120 మంది శాసనసభ్యులు ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 10,98,903 ఓట్లు కాగా, బీజేపీ బలం సగం కంటే ఎక్కువగా ఉంది. ఎంపీకి ఒక్కో ఓటు విలువ 708. ఎమ్మెల్యేల విషయానికొస్తే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఓటు విలువ ఒక్కోలా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యే ఓట్లకు అత్యధిక విలువ – 208 అత్య‌ధికంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు 270 సీట్లకు పైగా గెలుపొందడంతో తదుపరి రాష్ట్రపతిని ఎంచుకోవడానికి అధికార పార్టీ కి అనుకూలంగా ఉంది. సో…వెంక‌య్యనాయుడు అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేస్తే..ద‌క్షిణ భార‌తం, తెలుగు రాష్ట్రాల ఈక్వేష‌న్ తో రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని ఈజీగా బీజేపీ ఖాతాలో వేసుకోవ‌చ్చు. ఆ కోణం నుంచి చూస్తే వెంక‌య్య నాయుడు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి అంటూ వైర‌ల్ అవుతోన్న మెసేజ్ లు నిజ‌మ‌య్యే ఛాన్స్ ఉంది. అదే జ‌రిగితే, ఉత్త‌రభార‌త‌దేశం నుంచి ఉప‌రాష్ట్ర‌ప‌తి విష‌యంలో నితీష్ కు ఛాన్స్ ఉంద‌ని టాక్‌.

Updated 29-03-22 1:30PM – అయితే,  భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఎంపిక చేశారంటూ వస్తున్న వదంతులను ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది.దయచేసి ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది.