Site icon HashtagU Telugu

Varma On Gudiwada Casino : టీడీపీ ‘కాసినో’ ఇష్యూ వర్మ హైజాక్‌

Kodai Varma

Kodai Varma

మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని , టీడీపీ మధ్య కాసినో ఇష్యూ రగులుతుంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ కసినోకు కేంద్రం అయింది. దానిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. అక్కడ జరిగిన కాసినో తోపాటు డాన్స్ లు, గ్యాంబ్లింగ్ మీద నివేదిక తయారు చేసింది. దాన్ని ఫిర్యాదు రూపంలో గుడివాడ పోలీస్ కు ఇవ్వడానికి మాజీమంత్రి కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, బోండా ఉమ తదితరులు వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయానికి కొడాలి అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. దీంతో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. పోలీస్ ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా మీడియా ఫోకస్ చేసింది. ఇరు వర్గాలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. మీడియాకు ఒక రోజు పని దొరికింది. కానీ , చట్టాన్ని మాత్రం తుంగలోతొక్కారు. సంక్రాంతి ముగిసిన వారానికి టీడీపీ హడావిడి చేయటం గమనార్హం.
ఇక ఈ ఇష్యూలోకి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ జొరబడ్డాడు. నాని ఎవరో తెలియదు అంటూ ఆ మధ్య సెటైర్ వేసిన ఆయన ఇప్పుడు కొడాలి జై కొడుతున్నాడు. వర్మ చేసిన ట్వీట్ మంత్రి కి మరింత బలాన్ని ఇచ్చింది.గోవా, లాస్ వెగాస్‌ను తలదన్నేలా గుడివాడను తయారు చేసాడని కితాబు ఇచ్చాడు వర్మ.

మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేస్తూ.. గుడివాడను ఆధునిక, నాగరిక ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నానికి మనస్పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నానని సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. సరిగ్గా టీడీపీ నిజానిర్ధారణ కమిటీ హడావిడి సమయంలోనే వర్మ ట్వీట్ చేసాడు. గుడివాడలో కాసినో పెట్టడం తిరోగమన చర్య అంటున్న వాళ్ళను. మీరు పట్టించుకోవద్దు అంటూ ట్వీట్ ఇచ్చాడు. జై గుడివాడ అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ‘గుడివాడలో కాసినో పెట్టిన కొడాలి నానిని తప్పుపట్టిన వారికి నేను ఓ ప్రశ్న వేస్తున్నాను. మీలో ఎవరైనా గోవాను, లాస్ వెగాస్‌ను తలదన్నేలా కొడాలి నాని ప్రయత్నించారనే విషయాన్ని గ్రహించారా అంటూ పరోక్షంగా టీడీపీ ని వర్మ ప్రశ్నించాడు.’గుడివాడ పట్టణాన్ని పారిస్, లండన్, లాస్ వెగాస్ సరసన నిలుపాలని ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన ప్రయత్నం అభినందనీయం. అందుకు నేను ఆయనను ఆరాధిస్తున్నాను అని మరో ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు. కాసినో పెట్టాలని కొడాలి నాని తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్లంతా.. అభివృద్ది నిరోధకులు. వాళ్లంతా ఇంకా చీకటి యుగంలోనే ఉన్నారనిపిస్తుంది అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు.

గోవా సంస్కృతిని గుడివాడకు కొడాలి నాని తీసుకొచ్చారని కొందరు మూర్ఖులు ఆరోపిస్తున్నారు. గుడివాడ ప్రజలు ఒక్క విషయంలో రియలైజ్ కావాలి. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్తారు. కానీ గోవా ప్రజలు గుడివాడకు రారు అనే విషయాన్ని గుర్తించడం లేదు. ఏదిఏమైనా గుడివాడను మోడర్నైజ్ చేయాలని కొడాలి నాని తీసుకొన్న నిర్ణయానికి నేను ఫిదా అవుతున్నాను అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇదంతా గుడివాడలో జరుగుతున్న పోలీస్ , టీడీపీ వార్ క్రమంలో చేసిన ట్వీట్లు. ఎప్పటిలా ప్రచారం కోసం గుడివాడ కాసినో ఇష్యూలో వర్మ ఎంట్రీ ఇచ్చాడా? లేక టీడీపీకి వ్యతిరేకంగా రంగంలోకి డిగాడా? అనేది ప్రశ్న. సినిమా టికెట్ ల అంశంలో వారం పాటు ప్రచారాన్ని వర్మ బాగా పొందాడు. ఇప్పుడు మళ్లీ కాసినో ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో కాసినో మంచిదా? చెడ్డదా? అనే చర్చకు ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా టీడీపీ చేసిన హడావుడి వర్మ వైపు తిరిగింది. సో..ఆందోళన హైజాగ్ అయింది. చట్టం దాని పని అది చేసుకోలేక గుడివాడలో చతికిల పడింది. దీనికి కొడాలి మీడియా ముందుకు వచ్చి ఎలా రియాక్ట్ అవతాడో ..చూద్దాం!