Site icon HashtagU Telugu

Varahi Service Center: ‘వారాహి’ సర్వీస్ సెంటర్ విజయవాడ

Varahi Service Center Vijayawada

'varahi' Service Center Vijayawada

మూలన పడ్డ వారాహి (Varahi) వాహనం కు మళ్ళీ సర్వీస్ చేయడం మొదలైంది. అందుకోసం జనసేనాని విజయవాడ వెళ్లారు. నాలుగు రోజులు అక్కడే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో నేనూ ఉంటా అనే సంకేతం బలంగా ఇవ్వడానికి కాపు అండ్ టీంను పోగేస్తున్నారు. ఆ క్రమంలో వెటరన్ లీడర్ హరిరామ జోగయ్య వారాహి ఎక్కబోతున్నారు. ఇటీవల వరకు ముద్రగడ కనిపించిన ప్లేస్ లో జోగయ్య కనిపించ బోతున్నారు.

జనసేన పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ నాలుగు రోజుల పాటు విజయవాడలోనే బస చేయనున్నారు. 14న మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవం సభ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం పలు విభాగాల నేతలతో ఆయన ప్రత్యేకంగా ముందుగా సమావేశం కానున్నారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు బీసీ సంక్షేమంపై పార్టీ కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారు. 12న ఉదయం పార్టీ నాయకులతో సమీక్ష చేస్తారు. కొత్తగా పార్టీలో చేరే వారిని ఆహ్వానిస్తారు. అదే రోజు చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ అవుతారు. 13వ తేదీ ఆవిర్భావ దినోత్స కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష ఉంటుంది. ఆ తరువాత కొత్త గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను విజయవాడ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలుస్తారు.14వ తేదీన ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి (Varahi) వాహనంపై యాత్రగా బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మొత్తంగా నాలుగు రోజుల పాటు పవన్‌ మంగళగిరిలో అందుబాటులో ఉంటారు.

కాపు, బీసీ సంఘాల నేతలను ఈసారి పవన్ నమ్ముకున్నారు. పార్టీ ఆవిర్భావ సభలోనే పలు నిర్ణయాలు ప్రకటిస్తారని, ఆ సభలోనే మెనిఫెస్టోపైనా క్లారిటీ ఇస్తారని జనసైనికులు భావిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? తదిరత అంశాలపైనా పవన్ మరో సినిమాటిక్ షో ను చూపించబోతున్నారు. తాను పోటీ చేయబోయే స్థానంపైనే నేతలకు సంకేతాలు ఇస్తారని తెలుస్తోంది.

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే విషయంలో తాజాగా ఓ సర్వే సంస్ధ నిర్వహించిన అభిప్రాయసేకరణలో జనసేన పార్టీకి కేవలం 7 సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అదీ కాపుల జనాభా ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లో మాత్రమే. ఓ జిల్లాలో నాలుగు, మరో జిల్లాలో మూడు సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇతర విపక్షాల ఓట్లను చీల్చేందుకు మాత్రమే జనసేన పనికొస్తుందని ఈ సర్వే తేల్చేసింది. దీంతో జనసేన భారీగా ఆశలు పెట్టుకుంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం లేదని తేలిపోయింది. అంటే గత ఎన్నికల పరిస్దితులు దాపురిస్తాయా? అనే భయం ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. అందుకే వీరమరణం గురించి పవన్ రాజకీయం మొదలుకానుంది. అందుకు మచిలీపట్నంలో వారాహి సినిమా ను పవన్ కొత్త కోణంలో చూపిస్తారని ప్రత్యర్ధులు సెటైర్ లు వేస్తున్నారు.

Also Read:  Health Insurance Plan: నూటికి నూరు శాతం చెల్లించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమిటో తెలుసా?