Site icon HashtagU Telugu

Vanpic Case : `వాన్ పిక్`లో జ‌గ‌న్, నిమ్మ‌గడ్డ‌కు క్లీన్ చిట్

Vanpic Case

Vanpic Case

వాడరేవు మరియు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్ పిక్) కేసు నుంచి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, పారిశ్రామిక‌వేత్త నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ దాదాపుగా బ‌య‌ట‌ప‌డ్డారు. క్విడ్ ప్రో కో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు కింద స‌మీక‌రించిన భూముల్లో జ‌రిగింద‌ని అప్ప‌ట్లో కేసు ఫైల్ అయింది. దానిపై విచార‌ణ చేసి, వాన్ పిక్ భూముల‌ను ఈడీ ఆధీనంలోకి తీసుకుంది. ఆ భూముల‌ను విడుద‌ల చేయాల‌ని ఈడీకి తెలంగాణ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఆదేశించింది. ఫ‌లితంగా స్వ‌ర్గీయ వైఎస్ హ‌యాంలో పురుడుపోసుకున్న వాన్ పిక్ ప్రాజెక్టు ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో తిరిగి లాంఛ్ చేయ‌డానికి ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ మరియు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ నిందితుడు. ప్రకాశం జిల్లాలో 561.1996 ఎకరాల భూమిని, వాన్‌పిక్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్ప‌ట్లో సేక‌రించారు. అలాగే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 855.7130 ఎకరాల భూమిని వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌కు స‌మీక‌రించారు. ఆ భూమి సేక‌ర‌ణ క్ర‌మంలో క్విడ్ ప్రో కో జ‌రిగింద‌ని కేసు న‌మెదు అయింది. దానిపై ఈడీ విచార‌ణ చేసి కోర్టుకు నివేదిక‌ను స‌మ‌ర్పించింది. ఆ నివేదిక‌ను ప‌రిశీలించిన‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరపెల్లి నందాతో కూడిన డివిజన్‌ ​​బెంచ్ ఆ భూముల‌ను విడుద‌ల చేయాల‌ని ఈడీని ఆదేశించింది.

జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సీబీఐ చార్జ్ షీట్ ఆధారంగా వాన్‌పిక్ ప్రాజెక్టులో భాగమైన 1,416.91 ఎకరాల పట్టా భూమిని తాత్కాలికంగా 2014లో ఈడీ జప్తు చేసింది. ఆ తర్వాత తాత్కాలిక అటాచ్‌మెంట్‌ను నిర్ధారించింది. దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్ లిమిటెడ్ మరియు ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో PMLA సెక్షన్ 26 కింద వేర్వేరు అప్పీళ్లకు వెళ్లాయి. అప్పీల్ విచారణలో ఉండగా, 2017లో ED వాన్‌పిక్ ప్రాజెక్ట్‌లో భాగమైన 11,804.78 ఎకరాల అసైన్డ్ భూములను తాత్కాలికంగా అటాచ్ చేసింది. తొలుత 2014లో అటాచ్ చేసిన 1416.91 ఎకరాల పట్టా భూమిని, ఆ త‌రువాత 2017లో అటాచ్ చేసిన 11,804.78 ఎకరాలు వెర‌సి 13,221.69 ఎకరాల భూమిని ED భౌతికంగా స్వాధీనం చేసుకుంది. తాత్కాలిక అటాచ్‌మెంట్‌పై అప్పీల్ పెండింగ్‌లో ఉంది.

వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వోడరేవు-నిజాంపట్నం ఓడరేవులు మరియు పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్‌ల అమలు కోసం రూపొంచారు. ఇదే వాన్ పిక్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్‌లో ఒకటైన రస్ అల్ ఖైమా ప్రభుత్వం మధ్య ఏర్పడిన ఒప్పందం ద్వారా రూపొందించిన ప్రభుత్వ ప్రాజెక్టు అది. ఆ ప్రాజెక్టు క్ర‌మంలో క్విడ్ ప్రో కో జ‌రిగింద‌ని ఈడీ చేసిన విచార‌ణ‌పై హైకోర్టు సంతృప్తి చెంద‌లేదు. పైగా క్విడ్ ప్రో కో కు సంబంధించిన ఆన‌వాళ్ల‌ను కోర్టు ముందుకు ఈడీ ప్రూ చేయ‌లేకపోయింది. దీంతో భూముల‌ను విడుద‌ల చేయాల‌ని తెలంగాణ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఆదేశించింది.