Site icon HashtagU Telugu

Vangaveeti Brothers : అన్మ‌ద‌మ్ముల ‘రెక్కీ’ అనుబంధం

Vangaveeti Family

Vangaveeti Family

వంగ‌వీటి రంగా హ‌త్య‌తో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు ఎలాంటి సంబంధంలేదు. ఆ విష‌యాన్ని సాక్షాత్తు రంగా కుమారుడు రాధా స్ప‌ష్టం చేశాడు. తెలుగుదేశం పార్టీలో ఆయ‌న చేరిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆ విష‌యాన్ని రెండేళ్ల క్రితం తేల్చేశాడు. ఆ రోజు నుంచి రాధా పెద‌నాన్న కుమారుడు వంగ‌వీటి న‌రేంద్ర గుర్రుగా ఉన్నాడు.వంగ‌వీటి రాధా, వంగ‌వీటి న‌రేంద్ర ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములు. రాజ‌కీయంగా ఎలాంటి విభేదాలు లేకుండా ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంపై కొన్ని ద‌శాబ్దాల పాటు పైచేయిగా నిలిచారు. తొలి నుంచి కాంగ్రెస్ వాదులుగా ఆ పార్టీ నీడ‌న రాజ‌కీయాల‌ను సుదీర్ఘంగా న‌డిపారు. దేవినేని నెహ్రూ వ‌ర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని రాజ‌కీయాలు, గ్రూపు పాలిటిక్స్ వంగ‌వీటి వ‌ర్గం చేసేది. కానీ, స్వ‌ర్గీయ వైఎస్ విజ‌య‌వాడ పాలిటిక్స్ ను చాలా వ‌ర‌కు మార్చేశాడు. దేవినేని నెహ్రూను కూడా కాంగ్రెస్ లోకి వైఎస్ ఆనాడు తీసుకున్నాడు. దీంతో ఒకే వ‌ర‌లో రెండు క‌త్తుల మాదిరిగా నెహ్రూ, రంగా వ‌ర్గం కాంగ్రెస్ లో ఉండేది. ఇద్ద‌ర్నీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వైఎస్ రాజ‌కీయాలు న‌డిపాడు.

Also Read : పొలిటిక‌ల్ బాంబ్ రెడీ! ‘రెక్కీ’ ర‌హ‌స్యం!!

నెహ్రూ, వైఎస్ మ‌ర‌ణాల త‌రువాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ టీడీపిలో చేరాడు. గుడివాడ నుంచి 2019లో కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయాడు. అదే స‌మ‌యంలో వంగ‌వీటి రాధా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. వంగ‌వీటి, దేవినేని వారుసులు కొద్దికాలం పాటు టీడీపీలో కొన‌సాగారు. ఇటీవ‌ల మ‌ళ్లీ వైసీపీలోకి నెహ్రూ కుమారుడు అవినాష్ వెళ్లాడు. టీడీపీలో వంగ‌వీటి రాధా కొన‌సాగుతున్నాడు. ఏపీలోని ప్ర‌ధాన పార్టీల ద్వారా విజ‌యవాడ‌ కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుపుతున్నారు.తాజాగా వంగ‌వీటి రంగా వ‌ర్థంతి సంద‌ర్భంగా `రెక్కీ` విష‌యాన్ని రాధా బ‌య‌ట‌పెట్టాడు. భౌతికంగా లేకుండా చేయ‌డానికి కొంద‌రు రెక్కీ నిర్వ‌హించార‌ని వెల్ల‌డించాడు. దీంతో బెజ‌వాడ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. మ‌ళ్లీ హ‌త్య‌ల సంస్కృతి వ‌స్తుందేమో..అనే ఆందోళ‌న మొద‌లైయింది. ఆ క్ర‌మంలోనే రాధా జోలికి వ‌స్తే..ఊరుకోనంటూ ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయ‌న సోద‌రుడు న‌రేంద్ర‌ వార్నింగ్ ఇచ్చాడు. రాజ‌కీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్న‌ప్ప‌టికీ రాధా జోలికొస్తే..ఖ‌బ‌డ్దార్ అంటూ గ‌ర్జించాడు. ప్ర‌త్య‌ర్థులు కాలుదువ్వితే ఇద్ద‌రం ఒక్క‌ట‌వుతామంటూ హెచ్చ‌రించాడు. దీంతో మ‌ళ్లీ ర‌క్త చ‌రిత్ర వ్య‌వ‌హారం బెజ‌వాడ కేంద్రంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.