Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే, తదుపరి చర్యలు మైనింగ్ వాల్యూయేషన్ నివేదిక ఆధారంగా తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు
బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. మైనింగ్ విలువలపై నివేదిక అందించిన తరువాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ, రూ.195 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరిగిందని పేర్కొన్నారు. తమ వాదనలు వినకుండా బెయిల్ మంజూరు చేయడం అన్యాయం అని వాదించారు. ఈ కేసులో తదుపరి విచారణ జులై 16కి వాయిదా పడింది.
ఇదిలా ఉండగా, వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. గత నాలుగు నెలలుగా (138 రోజులు) విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. తాజాగా మంగళవారం నకిలీ భూ పట్టాల కేసులో నూజివీడు కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం వంశీపై ఉన్న అన్ని కేసులలో ఆయనకు బెయిల్ లభించిన నేపథ్యంలో విడుదలకు మార్గం సుగమమైంది. అలాగే, వంశీ జైలు నుంచి విడుదలయ్యే వేళ, ఆయనను స్వాగతించేందుకు పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు జైలువద్దకు చేరుకోనున్నారు.