సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్‌కు న్యాయస్థానం మరోసారి రిమాండ్ పొడిగించింది. అతని కస్టడీ ముగియడంతో మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్ లో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇంకా అరెస్టు కావాల్సిన ప్రధాన నిందితుల్లో, former MLA వల్లభనేని వంశీకి అనుచరుడైన కొమ్మా కోటేశ్వరరావు (కొట్లు) ఒకరు. అతడితో పాటు మరి కొంతమంది నేపాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా, వంశీ, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.
అయితే, A-5గా ఉన్న ఓలుపల్లి మోహనరంగారావు (రంగా) గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కిడ్నాప్ కేసులో పీటీ వారెంటుపై కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో రంగాతో పాటు కొమ్మా కోట్లు సమాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సత్యవర్ధన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోట్లు సేకరించి, రంగాతో పంచుకున్నట్లు సమాచారం. వంశీని అరెస్టు చేసిన తర్వాత వారు ఊరు దాటేశారు.
రంగా ఇటీవల సీఐడీ బృందం చేత ఏలూరులో దొరికాడు. మిగతా ఆరుగురు నిందితుల్లో విశాఖకు చెందిన ఇద్దరు శ్రీకాకుళం వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్లో ఉన్న కొమ్మా కోట్లు మరియు మరొక ముగ్గురు నిందితులు అక్కడి నుంచి సన్నిహితులకు ఫోన్ చేసి కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. కొమ్మా కోట్లు రాత్రి సమయాల్లో ఫోన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. పోలీసులు ఆ నలుగురూ నేపాల్లో ఎక్కడుంటున్నారో అని ఆరా తీస్తున్నారు. పక్కా వివరాలు అందగానే అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.