Site icon HashtagU Telugu

Vaikuntha Ekadashi: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు!

Tirumala1

Tirumala1

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు (Vaikuntha Ekadashi) ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారు జాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెలంగాణలోని యాదాద్రితో పాటు, ద్వారకా తిరుమల, సింహాచలం వంటి పుణ్య క్షేత్రాల్లో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

తిరుమలలో (Tirumala) శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం (Vaikuntha Ekadashi) ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు సూచనలు

👉వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించాలని 2020 వ సంవత్సరంలో టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది.

👉దీనివల్ల సుమారు 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే అవకాశం కలిగింది.

👉సర్వదర్శనానికి వచ్చే భక్తులు టైంస్లాట్ టోకెన్లు తీసుకోవడం ద్వారా క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా దర్శనం చేసుకోవచ్చు. కావున భక్తులు తిరుపతిలో టోకెన్లు తీసుకునే సర్వదర్శనానికి రావాలి.

👉సర్వదర్శం టోకెన్లు ఇచ్చు కేంద్రాలు: 1. అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్, 2. రైల్వేస్టేషన్ ఎదురుగా గల విష్ణు నివాసం, 3. రైల్వే స్టేషన్ వెనుక గల 2, 3 సత్రాలు, 4. ఆర్ టిసి బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్, 5. ఇందిరా మైదానం, 6. జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, 7. బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, 8. ఎంఆర్ పల్లి జడ్పి హైస్కూల్, 9. రామచంద్ర పుష్కరిణి.

👉ఈ కౌంటర్లలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజులకుగాను జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 4.50 లక్షల టోకెన్ల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా ఇస్తారు.

👉క్యూలైన్లలో భక్తులకు టిఫిన్, అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, టీ ఏర్పాటు చేస్తారు. టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలలోని క్యూ లైన్లలోకి అనుమతిస్తారు.

👉టిటిడి వెబ్సైట్, ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలి.

👉తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తమ టోకెన్పై సూచించిన తేదీ, సమయానికే తిరుమలకు రావాలని మరీ మరీ కోరడమైనది. ఇది భక్తుల సౌకర్యం కోసమే చేస్తున్న ఏర్పాటు.

👉కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున భక్తులందరికీ మాస్క్ తప్పనిసరి. * ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం కోసం ఈ 10 రోజులు సిఫారసులేఖలు స్వీకరించబడవు..

Exit mobile version