TTD Darshan: టిక్కెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం!

వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 09:01 PM IST

వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అయితే, టోకెన్లు లేనివారు తిరుమలకు రావొచ్చని, కానీ శ్రీవారి దర్శనానికి అనుమతించమని ఈవో చెప్పారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు.

తిరుమలలో ‘డయల్‌ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఈవో వివరించారు.ఈవో మాట్లాడుతూ.. ”వైకుంఠ ద్వార దర్శనాల వేళ రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను జారీ చేస్తాం. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తాం. తిరుమల స్థానికులకు కౌస్తుభం వద్ద టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తంగా 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. 10 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తాం. శ్రీవారి ట్రస్టు దాతలకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తాం. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తాం. డిసెంబర్‌ 29 నుంచి జనవరి 3వ తేదీ వరకు తిరుమలలో అడ్వాన్స్‌ గదుల బుకింగ్‌ నిలిపివేస్తున్నాం. సీఆర్‌వో వద్దనే భక్తులకు గదులు కేటాయించేలా అన్ని ఏర్పాటు చేస్తాం” అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.