Farmers’ March: రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం..విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం

ఉత్తరాంధ్ర రైతుల మహాపాదయాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర రక్షణ సమితి అధ్యక్షుడు కొయ్య ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

  • Written By:
  • Updated On - September 25, 2022 / 01:46 PM IST

ఉత్తరాంధ్ర రైతుల మహాపాదయాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర రక్షణ సమితి అధ్యక్షుడు కొయ్య ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా ఈ రోజు విశాఖలో ప్రజా ప్రతినిధులు, మేథావులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలపైన, పరిపాలనా రాజధానిగా విశాఖకున్న ప్రాముఖ్యత, విశిష్టతలపై ప్రధాన చర్చ జరిగింది. ఈ సమావేశంలో కొయ్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికోసం ఉత్తరాంధ్ర ప్రజలు 5 లక్షల ఎకరాలు త్యాగం చేశారని చెప్పారు. 29 గ్రామాల కోసం చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలపై కవాతు చేయడానికి పాదయాత్ర పేరుతో వస్తున్నారన్నారు. పాదయాత్రను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అమరావతి రైతులది పాదయాత్ర కాదని దండయాత్ర అని ప్రొఫెసర్ విజయ్ కుమార్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం న్యాయమైనదన్నారు.
ఏపీకి మూడు రాజధానులు అవసరమని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని, పరిపాలనా రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయని పలువురు మేథావులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసిందన్నారు. గతంలో ఒక ప్రాంతానికే అభివృద్ధి పరిమితమై నష్టపోయినట్లు తెలిపారు. విశాఖ రాజధానిగా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని, ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పైడా కృష్ణప్రసాద్, ఆంధ్రాయూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ జీఎస్ఎన్ రాజు, ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ తదితరులు మాట్లాడారు. కాగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పలువురు ఉత్తరాంధ్ర మంత్రులు, ఎంపీలు డుమ్మా కొట్టారు. ఉత్తరాంధ్ర నుంచి ఎంపీలు సత్యనారాయణ, మాధవి మాత్రమే హాజరయ్యారు.ఉత్తరాంధ్ర వైసీపీ మంత్రులు, ఎంపీల గైర్హాజరుపై సర్వత్రా చర్చించుకుంటున్నారు.