ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తోంది. వీటిలో రూ.13వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు, రూ.2వేలు మాత్రం పాఠశాలల నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.. పాఠశాలలు కూడా మొదలుకానున్నాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ‘తల్లికి వందనం’ పథకం కింద డబ్బులు అకౌంట్లో జమ కావాలంటే విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి.
గతేడాది తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో అనుసంధానం కాకపోవడంతో చాలామంది విద్యార్థులు అర్హత ఉండి కూడా ‘తల్లికి వందనం’ పథకానికి దూరమయ్యారు. ఈ కారణంతో గతేడాది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ కాలేదు. గతేడాది ఎదురైన సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను అలెర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ బ్యాంకులకు వెళ్లి అకౌంట్‌కు ఆధార్ అనుసంధానమై ఉందో లేదో సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాకపోతే వెంటనే చేసుకోవాలని, లేకపోతే డబ్బులు అకౌంట్లో జమ కావని చెబుతున్నారు.
తల్లికి వందనం పథకానికి అర్హులైన లబ్ధిదారులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ అకౌంట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లే సమయంలో తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలని, ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాకపోతే వెంటనే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై సంతకం చేసి బ్యాంకులో సమర్పించాలని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే మొబైల్‌కు మెసేజ్ వస్తుందని తెలిపారు.
అలాగే ఆధార్ అధికారిక వెబ్‌సైట్ యూఐడీఏఐలోకి వెళ్లి మై ఆధార్ నుంచి ఆధార్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ లింక్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే లాగిన్ వస్తుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నంబరు ఎంటర్ చేసి, ఆ కింద ఉండే క్యాప్చర్ కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్మిట్ చేస్తే ఆధార్‌కు ఏ బ్యాంకు లింక్ ఉందన్న సమాచారం తెలుస్తుంది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకుంటే సంబంధిత బ్యాంకును సంప్రదిస్తే ఆధార్‌ను అనుసంధానం చేస్తారని అధికారులు తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
