Site icon HashtagU Telugu

Upasana Konidela : ఏపీ మహిళల కోసం ఉపాసన కీలక నిర్ణయం

Upasana

Upasana

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, శిశువుల సంక్షేమాన్ని మెరుగుపరిచేలా అపోలో ఫౌండేషన్‌ (Apollo Foundation) ఆధ్వర్యంలో టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తాత, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించి, మహిళలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency) నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉపాసన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 109 అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసి, తల్లులు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు అమలులో భాగంగా త్వరలోనే ఐసీడీఎస్‌ అధికారులతో సమావేశం నిర్వహించి, తగిన విధానాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

Mastan Sai : మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు ముమ్మరం.. కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌

ఈ కార్యక్రమానికి అపోలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీల నుంచి ప్రసవానంతరం తల్లి, శిశువు ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని దశల్లో సరైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు ఉపాసన తెలిపారు. శిశు మరణాలను తగ్గించడం, మహిళా సాధికారతను పెంపొందించడం కూడా ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు. మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ, ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమాజం కోసం ఒక గొప్ప పని చేస్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం మరింత విస్తృతంగా అమలవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి దీనిని ప్రారంభించడం మంచి పరిణామమని అభిప్రాయపడుతున్నారు.

ఉపాసన ప్రకటించిన ఈ ప్రాజెక్టు ఏపీ మహిళలకు, చిన్నారులకు అమూల్యమైన సహాయాన్ని అందించనుంది. ఆరోగ్య పరిరక్షణతో పాటు, పోషకాహారం, వైద్య సేవల కల్పన వంటి అంశాలు సమాజానికి ఎంతో మేలు చేసేందుకు దోహదపడతాయి. ఈ తరహా కార్యక్రమాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.