Dollar Seshadri : డాల‌ర్ శేషాద్రి ప్రస్ధానం… గుమ‌స్తా నుంచి OSDగా…!

తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం విశాఖపట్నంలో కన్నుమూశారు.

  • Written By:
  • Publish Date - November 29, 2021 / 10:54 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం విశాఖపట్నంలో కన్నుమూశారు. విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి హాజరైన డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం గుండెపోటు రావ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. 1978 నుంచి శ్రీవారికి సేవలందిస్తున్న డాలర్ శేషాద్రి 2007లో పదవీ విరమణ చేశారు.అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తప్పనిసరి కావడంతో శేషాద్రి సేవలు ఓఎస్డీగా కొనసాగాయి.

డాలర్ శేషాద్రి చివరి శ్వాస వరకు స్వామివారి సేవలోనే ఉన్నారు. డాలర్ శేషాద్రి మృతి టీటీడీకి తీరని లోటు అని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1944వ సంవ‌త్స‌రంలో డాల‌ర్ శేషాద్రి తిరుప‌తిలో జ‌న్మించారు.ఇక్క‌డే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈయ‌న అసలు పేరు పాల శేషాద్రి ..అయితే ఆయ‌న మెడ‌లో పోడువైన డాల‌ర్ ఉండ‌టంతో ఆయ‌న‌కు ఆ పేరు వ‌చ్చింది. డాల‌ర్ శేషాద్రి పూర్వీకులు త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కంచికి చెందిన వారు. ఆయ‌న తండ్రి తిరుమ‌ల నంబి ఆల‌యంలో గుమ‌స్తాగా విధులు నిర్వ‌ర్తించారు. డాల‌ర్ శేషాద్రి పీజీ పూర్తి చేసిన త‌రువాత 1978 లో టీటీడీలో గుమ‌స్తాగా ప‌ని చేశారు. గుమ‌స్తా నుంచి నేడు టీటీడీ ఓఎస్డీగా అంచ‌లంచెలుగా ఎదిగారు.

Dollar2

 

డాల‌ర్ శేషాద్రికి భార్య,ఇద్దరు అన్నలు,ఇద్దరు చెల్లెలు ఉన్నారు. అయితే ఆయ‌న జీవిత కాలంలో ఎక్కువ సంవ‌త్స‌రాలు శ్రీవారి సేవ‌లోనే త‌రించారు. 2013లో ఆయ‌న‌కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ జ‌రిగింది. ఈ త‌రువాత 2016 లో ఒక సారి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందిన త‌రువాత కోలుకున్నారు.2006 వ సంవ‌త్స‌రంలో తిరుప‌తిలో బంగారు డాల‌ర్ మిస్సింగ్ కేసులో డాల‌ర్ శేషాద్రిపై అభియోగాలు వ‌చ్చాయి. ఈ ఆరోప‌ణ‌ల‌తో 2009లో ఆప్ప‌టి ఈవో కృష్ణారావు ఆదేశాల మేర‌కు తొమ్మిది నెల‌ల పాటు విధుల‌కు దూర‌మైయ్యారు.ఈ కేసులో కోర్టు ఆదేశాల‌తో డాల‌ర్ శేషాద్రి తిరిగి విధుల్లోకి చేరారు. త‌న స‌ర్వీసులో 15 నెల‌లు కాలం మిన‌హాయిస్తే పూర్తిగా శ్రీవారి స‌న్నిధిలో విధులు నిర్వ‌ర్తించారు.

Dollar3

పాల శేషాద్రి అంటే ఎవ‌రికీ తెలియ‌దు…దేశ విదేశాల్లో ఉన్న భ‌క్తుల‌కు డాల‌ర్ శేషాద్రి అంటే ట‌క్కున గుర్త‌ప‌ట్టేంతంగా ఆయ‌న ఎదిగారు. సామాన్యుల నుంచి వీవీఐపీల వ‌ర‌కు ఆయ‌న సుప‌రిచితుడు..ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేవ్‌, విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్య‌మంత్రులు, టీటీడీ ఈవోలు, టీటీడీ ఛైర్మ‌న్ లు మారినా డాల‌ర్ శేషాద్రి మాత్రం మార‌లేదు.ఆయ‌న ప‌ద‌వీర‌మ‌ణ చేసిన ఆయ‌న సేవ‌లు తిరుమ‌ల‌కు అవ‌స‌రమ‌ని ప్ర‌భుత్వం గుర్తించి ఓఎస్డీగా అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌స్తుత సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌తో డాల‌ర్ శేషాద్రికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ స్వ‌యంగా శేషాద్రి ఇంటికి వెళ్లారు. ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోవాలని….మరోసారి తిరుమలకు విచ్చేసిన సమయంలో వస్తానంటు శేషాద్రికి ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. అయితే హ‌ఠాత్తుగా డాల‌ర్ శేషాద్రి మ‌ర‌ణించ‌డంతో ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళ్లు అర్పించారు.