Site icon HashtagU Telugu

Sr NTR : 24 ఇడ్లీ, 40 బ‌జ్జీలు, 2 లీట‌ర్ల‌పాలు.. జ‌య‌హో ఎన్టీఆర్

క‌లియుగ‌పురుషుడు, విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు..నిండైన తెలుగుదనం ఉట్టిప‌డే ఆహార్యం..తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పిన మేరున‌గ‌ధీరుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌. ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఆహారపు అలవాట్లు, మాన‌సిక‌, శారీర‌క వ్యాయామాల గురించి కార్య‌క‌ర్త‌ల‌కు టీడీపీ తెలియ‌జేస్తోంది. ఎన్టీఆర్ జీవిత ఆశ‌యాలు, ఆద‌ర్శాలు, అల‌వాట్లు, అన్నగారి ఆలోచ‌న‌ల‌ను స్పూర్తిగా తీసుకుని క్యాడ‌ర్ ను న‌డిపేందుకు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వాల‌ని పార్టీ సీనియ‌ర్లు యోచిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో అన్న ఎన్టీఆర్ పోరాటప‌టిమ‌, ఆహార‌పు అల‌వాట్లు, స‌మ‌యానికి ఆయ‌న ఇచ్చే విలువ‌, శారీర‌క వ్యాయామం, యోగ‌..త‌దిత‌రాల గురించి తొలి విడ‌త పోస్టులు పెడుతున్నారు. వాటికి వ‌చ్చే స్పంద‌న చూసిన త‌రువాత జీవన‌ వైవిధ్యం పై ప్ర‌త్యక్షంగా క్లాస్ లు తీసుకోవాల‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యం భావిస్తున్న‌ద‌ట‌. ఆ క్ర‌మంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ గురించి సంక్షుప్తంగా టీడీపీ గ్రూపుల్లో వైర‌ల్ అవుతున్న ఒక క‌థ‌నం ఇలా..

`తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పిన నటుడు నటరత్న ఎన్టీఆర్‌. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకొని, ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇక శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పౌరాణిక పాత్రల పోషణతో ఆయన్ని నిజంగా దైవంగా భావించేవారు ఎందరో!కెరీర్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత రెండు షిఫ్టులు మాత్రమే వర్క్‌ చేసేవారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక సినిమాకి, రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మరో సినిమాకు ఆయన పనిచేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకూ ఒకే సినిమాకు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. అవసరం అనుకుంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా వర్క్‌ చేసేవారు.

ఎన్టీఆర్‌ ఆహారపు అలవాట్ల గురించి వింటుంటే తమాషాగా అనిపిస్తుంది. తెల్లారి మూడున్నర గంటలకు లేచి, యోగాసనాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, బ్రేక్‌ ఫాస్ట్‌ చేసే వారు. రోజూ 24 ఇడ్లీలు అవలీలగా తినేవారు. అవి చిన్న చిన్న ఇడ్లీలు కావు. అరచేతి మందాన ఉండేవి (కొంత కాలం తర్వాత ఇడ్లీలు తినడం మానేసి, పొద్దునే భోజనం చేసేవారు. ప్రతి రోజూ నాన్‌ వెజ్‌ ఐటెం ఏదోకటి ఆయన భోజనంలో ఉండాల్సిందే)ఆరు గంటల కల్లా మేకప్‌ వేసుకుని రెడీగా ఉండేవారు. నిర్మాత వచ్చి ఆయన్ని షూటింగ్‌ స్పాట్‌కు తీసుకెళ్లేవారు. చెన్నైలో ఉంటే తప్పనిసరిగా భోజనానికి ఇంటికే వెళ్లేవారు. అరగంటలో లంచ్‌ పూర్తి చేసుకుని, రెండు గంటలకు మరో షూటింగ్‌కు అటెండ్‌ అయ్యేవారు.
షాట్‌ గ్యాప్‌లో ఆపిల్‌ జ్యూస్‌ తాగడం ఎన్టీఆర్‌కు అలవాటు. రోజుకు నాలుగైదు బాటిల్స్‌ తాగేవారు. ఇక ఈవెనింగ్‌ స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్స్‌ కానీ, మిరపకాయ బజ్జీలు కానీ ఉండాల్సిందే. 30, 40 బజ్జీలు ఆయన తింటుంటే మిగిలిన వాళ్లంతా అలా నోళ్లు తెరుచుకుని చూస్తుండేవారు. మద్రాసు మౌంట్‌ రోడ్‌లో బాంబే హ ల్వా హౌస్‌ అనే షాప్‌ ఉండేది. అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్‌ తీసుకురమ్మనేవారు ఎన్టీఆర్‌. దాంతో పాటు రెండు లీటర్ల బాదం పాలు కూడా తెమ్మనేవారు. ఇంత పెద్ద డబ్బాలో తీసుకువస్తే వాటిని తిని, రెండు లీటర్ల బాదం పాలు తాగేవారు ఎన్టీఆర్‌. ఎంత తిన్నా హరాయించుకునే శరీరం ఆయనది.

ఇక సమ్మర్‌ వస్తే చాలు మధ్యాహ్నం లంచ్‌కు వెళ్లేవారు కాదు ఎన్టీఆర్‌. మామిడి పళ్ల జ్యూస్‌ మాత్రం తాగి సరిపెట్టుకునేవారు. టీ నగర్‌లో మామిడి పళ్లు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆయనే చెప్పేవారు. రెండు డజన్ల మామిడి పళ్లు తెప్పించేవారు నిర్మాత. దాంతో ఒక గ్లూకోజు ప్యాకెట్‌ కొనుక్కుని తెచ్చేవారు. తన అసిస్టెంట్‌తో ఆ మామిడి పళ్లు రసం తీయించి, అందులో గ్లూకోజు పౌడర్‌ కలుపుకొని జ్యూస్‌ మొత్తం తాగే వారు ఎన్టీఆర్‌. సమ్మర్‌లో ఇదే ఆయనకు లంచ్‌. మధ్యలో కొంత కాలం కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం, వెల్లుల్లి కలిపి బాగా దంచి, ముద్దగా చేసి వెండి బాక్స్‌లో ఇంటి నుంచి ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పంపేవారు. షాట్‌ గ్యాప్‌లో ఆ ముద్ద తినేవారు ఎన్టీఆర్‌.`
ఇలా..టీడీపీ క్యాడ‌ర్ కు అన్న ఎన్టీఆర్ అల‌వాట్లను, ఆద‌ర్శాల‌ను, స్పూర్తిని నింపేందుకు టీడీపీ స‌రికొత్త ప్ర‌యోగాల‌ను ప్రారంభించింద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో టాక్‌. జ‌య‌హో ఎన్టీఆర్‌.!