Polavaram Project: ఆంధ్ర జీవ‌నాడి.. పోల‌వ‌రం పురోగ‌తి భేష్..!

  • Written By:
  • Updated On - March 4, 2022 / 03:21 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ ఈ శుక్రవారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీప‌ట్నం మండ‌లం ఇందుకూరు పేట-1 పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, సీఎం జగన్ పరిశీలించారు. ఈ క్ర‌మంలో అక్క‌డి నిర్వాసితులతో మాట్లాడిన‌ గ‌జేంధ్ర‌ షెకావత్.. పోలవరం పునరావాస కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత తాను మరోసారి ఇక్కడికి వస్తానని గ‌జేంద్ర‌సింగ్ షెకావత్ తెలిపారు. ఇక పోల‌వ‌రం ప్రాజెక్టు పనుల‌ను పరిశీలించిన త‌ర్వాత అక్క‌డి ధికారులతో భేటీ అయిన షెకావ‌త్ మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను ముందుకు తెచ్చార‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పార‌ని గ‌జేంద్ర షెకావ‌త్ తెలిపారు. ఈ క్ర‌మంలో పోలవరం ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి షెకావ‌త్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నిర్వాసితులకు ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లో 6.8 లక్షల నుండి 10 లక్షలు ఇస్తామని గ‌తంలో ఇచ్చిన‌ మాటను నిలబెట్టుకుంటామని కేంద్ర‌మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ అన్నారు.

పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని, కాలనీలో మంచి వసతులు కల్పించిన ముఖ్య‌మంత్రి జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన మాటకు మోదీ సర్కార్‌ కట్టుబడి ఉందని.. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్ర‌భుత్వానిదే అని, ఈ పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతుండ‌గా మ‌ధ్య‌లో మరోసారి పర్యటిస్తాన‌ని కేంద్ర మంత్రి గ‌జేంద్ర‌ షెకావత్‌ అన్నారు. ఇక సీయం జగన్ మాట్లాతూ.. ఆంధ్ర రాష్ట్రానికి పోల‌వ‌రం జీవనాడి అని స్వ‌యానా కేంద్ర మంత్రే చెప్పారని, దీంత‌తో పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని జగన్‌ వెల్లడించారు. వైఎస్సార్‌ హయాంలో భూసేకరణలో ఎకరానికి లక్షన్నరే ఇచ్చినవారికి 5లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని జ‌గ‌న్ తెలిపారు. అలాగే పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

ఇక ఏపీ ముఖ్యమంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌ని త‌ర్వాత జ‌గ‌న్ తొలిసారి 2019 జూన్‌ 20న పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ త‌ర్వాత పలుమార్లు పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి జ‌ర‌గుతున్న‌ పనులపై, సంబంధింత‌ అధికారులు, మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. కరోనా సమయంలోనూ పోలవరం పనులను ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను గత ఏడాది పూర్తి చేసింది. 2021 జూన్‌ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్‌ చానల్, స్పిల్‌వే, స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌ మీదుగా ఆరున్నర కిలోమీటర్ల పొడవున మళ్లించింది. 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులను సైతం జ‌గ‌న్ సర్కార్ తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ప్రస్తుతం ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి జలవిద్యుత్ కేంద్రం పనులను పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది.