Site icon HashtagU Telugu

Vizag : వైజాగ్‌లో రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ద‌ర్శ‌న జర్ధోష్‌

Railway Coach Restaurant

Railway Coach Restaurant

ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖ‌ప‌ట్నంలో రైల్వే కోచ్ రెస్టారెంట్‌ని కేంద్ర రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీనిని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ విశాఖపట్నంలో రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. నగరంలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా దర్శన జర్దోష్ వాల్తెర్‌ డివిజన్ లో నాన్-ఫేర్ రెవెన్యూ కింద కోచ్ రెస్టారెంట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇలాంటి వినూత్న ప్రాజెక్టులను చేపట్టి వనరులను సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు డివిజనల్ అధికారులను ఆమె అభినందించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి, స్టేషన్‌లో స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ కార్యకలాపాలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. అనంతరం డివిజన్‌లో జరుగుతున్న పలు కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ ప్రసాద్‌, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌తో రైల్వే స్టేష‌న్‌లో జ‌రుగుత‌న్న పనుల‌ను ఆమెకు వివ‌రించారు. విశాఖపట్నం స్టేషన్‌లో ఏటికొప్పాక బొమ్మలు విక్రయిస్తున్న ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ స్టాల్‌ను దర్శన జర్దోష్‌ సందర్శించి విక్రయదారులతో మాట్లాడారు. విక్రయాలపై ఆరా తీశారు.

అనంతరం స్వచ్ఛతా అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొని స్టేషన్‌లోని సఫాయి కర్మచారులకు హెల్త్‌ కిట్‌లను పంపిణీ చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్రను ఆమె అభినందిస్తున్నారు. డిఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ డివిజన్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను, డివిజన్‌ ​​సాధించిన కీలక విజయాలను వివరించారు. గతిశక్తి అధికారులు డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను, ప్రాజెక్టు పురోగతిని వివరించారు. స్టేషన్‌లో కొనసాగుతున్న మల్టీ లెవల్ కార్ పార్కింగ్ స్థలాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఒకటని కేంద్ర‌మంత్రి ద‌ర్శ‌న జర్ధోష్ తెలిపారు. స్టేషన్ పునరాభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేసిన వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. వాటిని సకాలంలో పూర్తి చేసే మార్గాలపై అధికారుల‌తో ఆమె చర్చించారు.