Vizag Metro : వైజాగ్ మెట్రోపై కేంద్రం క్లారిటీ…బ‌య‌టికొచ్చిన ఏపీ ప్ర‌భుత్వం అబ‌ద్ధాలు

వైజాగ్ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను సమర్పించలేదని కేంద్రం పేర్కొంది.

  • Written By:
  • Publish Date - March 29, 2022 / 03:31 PM IST

వైజాగ్ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను సమర్పించలేదని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో ఎంపి జివిఎల్ నరసింహారావు అడిగి ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పూరీ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. మెట్రోరైలు ప్రాజెక్టు కోసం 2017లో ప్రతిపాదనను సమర్పించాలని ఏపీ సర్కార్ ను కోరామని..ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. రూ. 12, 345కోట్లతో 42.55కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు నెట్ వర్క్ కోసం గతంలో ప్రతిపాదనను ఏపీ సమర్పించినట్లు తెలిపారు. తర్వాత దానిని కొనసాగించలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వైజాగ్ మెట్రోరైలు ప్రాజెక్టును తొలిసారిగా 2014లో ప్రతిపాదించారు. దీనికి 2015లో కేంద్ర ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. అసలు ఈ ప్రణాళిక ప్రకారం 2018 నాటికి మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. ఈ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం రెండేళ్లకు పైగా జాప్యం చేసింది. మెట్రోలు రైలు ప్రాజెక్టు కోసం 2017లో మళ్లీ ప్రతిపాదనను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం…ప్రాజెక్టును కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించింది. గత బిడ్ ను రద్దు చేసింది. సవరించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక ( DPR) తయారీకి కొత్త కన్సల్టెంట్ ను నియ‌మించింది. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ను మార్చాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో..మెట్రో రైలు ప్రాజెక్టు వేగవంతం అవుతుందని అంతా భావించారు. అయితే మూడు రాజధానుల విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టతల లేదు. 2015 డిసెంబర్లో సమర్పించిన అసలు ప్రతిపాదన ప్రకారం…వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం యొక్క జాయింట్ వెంచర్ ఈక్విటీ భాగస్వామ్యంగా ఉద్దేశించబడింది. 12, 345కోట్ల తో 42.55కి.మీ పొడువుతో మెట్రో రైలు నెట్ వర్క్ కోసం గతంలో ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. మళ్లీ జనవరి 2017లో దానిని సవరించింది.