Undavalli Arun Kumar: జ‌గ‌న్‌కు అంత భ‌య‌మెందుకో.. ఉండ‌వ‌ల్లి షాకింగ్ కామెంట్స్..!

  • Written By:
  • Publish Date - February 9, 2022 / 05:27 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న పై తాజాగా రాజ్యస‌భ‌లో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బీజేపీ శ్రేణులు త‌ప్పా, అధికార టీఆర్ఎస్ పార్టీతో స‌హా అన్ని పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మోదీ వ్యాఖ్య‌ల పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలియ‌జేస్తున్నారు. విభ‌జ‌న గాయంపై ప్ర‌ధాని మోదీ కారం పూస్తున్నార‌ని గులాబీ శ్రేణులు భ‌గ్గుమంటున్నారు. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పే వరకు బీజేపీ నేతలను రాష్ట్రంలో అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేత‌లు హెచ్చరించారు.

ఇక తాజాగా ఈ వివాదం పై ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాటి అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష‌ బీజేపీ పార్టీలు ఏపీని విడగొట్టాయని ఉండవల్లి అన్నారు. ఈ క్ర‌మంలో ఏపీ విభజన కార‌ణంగా ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందని, అస‌లు చర్చ లేకుండానే విభజన బిల్లును ఆమోదించారని ఉండ‌వ‌ల్లి ఫైర్ అయ్యారు. అస‌లు రాజధాని లేకుండానే ఒక రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఉండ‌వ‌ల్లి ప్రశ్నించారు. అధికార వైసీపీతో స‌హా ఏపీలో ఉన్నఅన్ని పార్టీలు, కేంద్రంలో అధికారంలో బీజేపీకి మద్దతుగా ఉన్నాయని ఉండ‌వ‌ల్లి ఆరోపించారు. ఇక రాష్ట్ర సమస్యలపై వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో, త‌న‌కే కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా అర్ధం కావ‌డంలేద‌ని, ఇప్ప‌టికైనా వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యల పై పోరాడాలని, లేకుంటే టీడీపీకి ప‌ట్టిన గ‌తే వైసీపీ కూడా ప‌డుతుంద‌ని ఉండ‌వ‌ల్లి హెచ్చిరించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై కూడా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారో త‌న‌కు అర్థం కావడం లేదని ఉండవల్లి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పడం వల్లే, జగన్ స‌ర్కార్ అధికారంలోకి వచ్చింద‌ని, ఎక్కువ సంఖ్య‌లో ఎంపీల‌ను గెలిపిస్తే, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని, నాడు జగన్ చెప్పిన మాటల్ని ఉండ‌వ‌ల్లి గుర్తు చేశారు. ఇప్పటికైనా పార్లమెంటు సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఉండవల్లి సూచించారు. ఇక రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి రావల్సిన నిధులను రాబట్టడంలో మొద‌ట టీడీపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న‌ వైసీపీ, రెండు పార్టీలు విఫలమయ్యాయని ఉండ‌వ‌ల్లి దుయ్యబట్టారు. లోక్‌సభలో మరోసారి చర్చ జరిగితేనే ఏపీకి సరియైన న్యాయం జరుగుతుందని ఉండ‌వ‌ల్లి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.