Accident: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

బెంగళూరు నగరంలోని మడివాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ వాసులు. వేగంగా వెళ్తున్న కారు సిల్క్‌బోర్డ్ కూడలి వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న తమిళనాడు బస్సును ఢీకొట్టింది.

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 11:12 AM IST

బెంగళూరు నగరంలోని మడివాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ వాసులు. వేగంగా వెళ్తున్న కారు సిల్క్‌బోర్డ్ కూడలి వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న తమిళనాడు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌కు చెందిన కార్తీక్ (23), జిల్లాలోని రాచర్ల మండలం రామాపురం వాసి భగీరథరెడ్డి (17) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: New Zealand: న్యూజిలాండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతగా నమోదు

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన కార్తీక్ కోరమంగళలోని గెస్ట్ హౌస్ (పీజీ)లో ఉంటూ సాఫ్ట్‌వేర్ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. భగీరథ రెడ్డి కోరమంగళలోని ఓ ప్రైవేట్ కాలేజీలో సెకండరీ ఎడ్యుకేషన్ (పీయూ) చదువుతున్నాడు. ఇద్దరు స్నేహితులు. కారులో అగ్రహారం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కార్తీక్ స్వయంగా కారు నడుపుతున్నట్లు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు వివరించారు. వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో బస్సులోని కొంతమందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారంతో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామాపురంకు చెందిన భగీరథరెడ్డి అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.