CM Jagan : ప్రజల ప్రాణాల కన్నా..జగన్ కు తన ప్రాణాలే ముఖ్యమా..?

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 02:59 PM IST

రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి (CM)..ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన పర్వాలేదు..ముందు తన ప్రాణాలే ముఖ్యం అని వ్యవహరిస్తున్నాడని ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్షపార్టీలు మండిపడుతున్నారు. గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో APSRTC ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుంటే..ఆ డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు డబ్బు లేదు కానీ..భద్రత పేరుతో గాల్లో తిరగడానికి 2 హెలికాప్టర్లను అద్దె కు తీసుకురావడం.. 20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులను (Two Bulletproof Buses) కొనుగోలు చేయడం ఇవే కాక 3 కోట్లతో మరో మూడు వాహనాలు సైతం కొనుగోలు చేయడం ఏంటి అని జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికల హడావిడి మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్న జగన్..త్వరలో పూర్తిస్థాయిలో ప్రతి రోజు అన్ని నియోజకవర్గాల్లో తిరిగేందుకు గాను సిద్ధం అవుతున్నారు. ఇందుకు గాను ప్రజల సొమ్ముతో అద్దెకు 2 హెలికాఫ్టర్లు, 20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులను కొనుగోలు చేసాడు. ఐదేళ్లుగా కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని చెపుతున్న ఆర్టీసీ.. జగన్‌ కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను కొనుగోలుచేసింది. ఇవికాక మరో 3 కోట్ల రూపాయలు వెచ్చించి మూడు నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కూడా కొనుగోలుచేసింది. ఇందులో రెండు నాన్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. సీఎం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు వీలుగా ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వ వర్గాల ఆదేశాలతోనే సీఎం పర్యటనలకు వినియోగించే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని, వీటిని వినియోగించుకున్నందుకు ప్రత్యేక టారీఫ్‌ ఉంటుందని, దాని ప్రకారం సర్కారు ఆర్టీసీకి సొమ్ము చెల్లిస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌ బస్సుల్లో ప్రయాణించేది అతికొద్ది దూరమే.ఏదైనా జిల్లాలో సభ ఉంటే హెలికాప్టర్‌లో చేరుకుంటారు.

అక్కడ హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక మధ్య దూరం గరిష్ఠంగా 5 కిలోమీటర్ల లోపే ఉంటుంది.సభాస్థలికి చేరుకొనేందుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను వినియోగిస్తారు. అయితే సీఎం హెలిప్యాడ్‌ నుంచి సభా వేదికకు చేరుకునే మార్గమంతా బారికేడ్లు ఏర్పాటుచేసి, పరదాలు కట్టేసి, దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటప్పుడు ఉన్నవి వాడుకోకుండా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో ప్రభుత్వం నడిపిస్తూ వస్తుంది.. ఈ డొక్కు బస్సుల్లో ప్రయాణం అంటే ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన కర్మ వచ్చింది. రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్‌ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయినాగానీ ప్రభుత్వం ఏనాడూ ప్రజల ప్రాణాల గురించి పట్టించుకున్న పాపన పోలేదు కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టి బస్సులు కొనుగోలు చేయడం ఏంటి వారంతా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని వాపోతున్నారు.

Read Also : TS : రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు