Site icon HashtagU Telugu

Jagan Vs Employees : ట‌గ్ ఆఫ్ వార్‌..ఉద్యోగులు వ‌ర్సెస్ జ‌గ‌న్‌

Jagan Victory

Jagan AP employees

ఏపీలో అస‌లు సిస‌లైన గేమ్ ప్రారంభం అయింది. ఇంత‌కాలం ప్ర‌భుత్వాల‌ను ఆడించిన ఉద్యోగ, ఉపాధ్యా సంఘ నేత‌లు జ‌గ‌న్ తో ఢీ కొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్ట‌గ‌లం…ఎక్కించ‌గ‌లం..అంటూ హూంక‌రించిన ఉద్యోగ సంఘ నేత‌లు మెరుపు స‌మ్మెకు సిద్ధం అయ్యారు. పీఆర్సీ అంటే పెంచ‌డం మాత్ర‌మే కాదు..త‌గ్గించ‌డం కూడా ఉంటుంద‌ని నిరూపించిన ఏకైక సీఎం జ‌గ‌న్‌. ఇంత‌కాలం పీఆర్సీ అంటే పెంచ‌డ‌మనే సంకేతాన్ని సామాన్యుల వ‌ర‌కు ఉద్యోగ సంఘ నేత‌లు తీసుకెళ్లారు. చ‌ట్ట ప్ర‌కారం పీఆర్సీ అంటే పెంచ‌డం కాదని నిరూపిస్తూ..ప‌రిస్థితుల‌కు అనుగుణంగా జీతాల‌ను సవ‌రించ‌డ‌మ‌నే వాస్త‌వాన్ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంలో విజ‌య‌వంతం అయింది.

కొత్త పీఆర్సీ ప్ర‌కారం జీతాల‌ను ఇవ్వాల‌ని గురువారం ట్రెజ‌రీకి ఉత్త‌ర్వులు వెళ్లాయి. ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు మాత్రం పాత పీఆర్సీ ప్ర‌కారం జీతాలు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. పులిని చూసి న‌క్క‌వాత‌పెట్టుకున్న సామెత‌గా మిగులు బ‌డ్జెట్ ఉన్న తెలంగాణ ఉద్యోగుల‌తో స‌మానంగా ఆనాడు చంద్ర‌బాబు ఏపీ ఉద్యోగుల‌కు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చాడు. డబుల్ హెచ్ ఆర్ ఏలు, ఉచిత వైద్యం, ఉచిత వ‌స‌తి, ఉచిత ప్ర‌యాణం, ప్ర‌త్యేక బ‌స్సులు, రైళ్లు..ఇలా అన్నీ ఉచితంగా ఇస్తూనే 43శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా బాబును ఉద్యోగులు లొంగ‌తీసుకున్నారు. ఆనాడు ఇచ్చిన ఫిట్మెంట్ కంటే ఎక్కువ‌గా ఇవ్వాల‌ని మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు. ఇప్ప‌టికే ఐఆర్ కింద 27శాతం ఉద్యోగులు తీసుకుంటున్నారు. సీఎస్ క‌మిటీ వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 14.29శాతం ఫిట్మెంట్ ఇవ్వాల‌ని సిఫార‌స్సు చేసింది. సీఎం జ‌గ‌న్ మాత్రం ఉన్నంత‌లో ఎక్కువ‌గా 23శాతం ఫిట్మెంట్ ను ప్ర‌కటించాడు. కానీ, ఉద్యోగులు మాత్రం రివ‌ర్స్ పీఆర్సీ అంటూ స‌మ్మె చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఆదాయ వ‌న‌రులు త‌గ్గాయి. కోవిడ్ తీవ్ర ప్ర‌భావం చూపింది. ఏపీ త‌ల‌స‌రి ఆదాయం ప‌డిపోయింది. ధ‌నిక‌, పేదల మ‌ధ్య వ్య‌త్యాసం భారీగా పెరిగింది. బీహార్ కంటే మాన‌వాభివృద్ధి సూచిక‌లో వెనుక‌బ‌డి ఉన్నాం. వీట‌న్నింటినీ అధ్య‌య‌నం చేసిన‌ సీఎస్ క‌మిటీ పీఆర్సీ సిఫార‌స్సు చేసింది. ప్ర‌స్తుతం కేంద్రం పే ఫ‌ర్ వ‌ర్క్ అనే ఫార్ములాను తీసుకొస్తోంది. అందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా రెడీ చేస్తోంది. పీఆర్సీపై కేంద్రం అనుస‌రిస్తోన్న మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా సీఎస్ క‌మిటీ సిఫార‌స్సు చేసింది. కానీ, సీఎస్ స‌మీర్ శ‌ర్మ సిఫార‌స్సుల‌పై ప‌లు ర‌కాలుగా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేత‌ల‌పై ఐఏఎస్ ల సంఘం మండిప‌డింది.

పే ఫ‌ర్ వ‌ర్క్ త‌ర‌హాలో రాష్ట్రం కూడా ఆలోచించాల్సిన త‌రుణం ఇది. ఎందుకంటే, కోవిడ్ 19 కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సామాన్యులు చితికిపోయారు. బ‌త‌క‌లేక ప్ర‌తి 4 సెక‌న్ల‌కు ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నార‌ని తాజాగా జాతీయ స్థాయిలో చేసిన అధ్య‌య‌నం చెబుతోంది. రైతులు, కార్మికులు మూడు పుట‌లా తినే ప‌రిస్థితి కూడా లేకుండా ఉంది. ప్రైవేటు ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని కంపెనీలు బోలెడు. కానీ, ప్ర‌భుత్వ ఉద్యోగులు మాత్రం రెండేళ్లుగా జీతాలు టంచ‌నుగా తీసుకుంటున్నారు. వైద్య‌, పోలీస్ రంగాలు మిన‌హా మిగిలిన రంగాల్లోని ఉద్యోగులు ప‌నిచేయ‌కుండానే చాలా మంది జీతాలు తీసుకున్నారు. ఫ‌లితంగా ఏపీ ప్ర‌భుత్వం ఖ‌ర్చులు పెర‌గ‌గా, ఆదాయం బాగా త‌గ్గిపోయింది. ఇలాంటి ప్ర‌మాణాల‌ను తీసుకుని సీఎస్ క‌మిటీ అధ్య‌య‌నం చేసి 14.29శాతం మాత్ర‌మే ఫిట్మెంట్ సిఫార‌స్సు చేసింది. కానీ, జ‌గ‌న్ దాన్ని 23శాతానికి తీసుకెళ్లాడు.

ప్ర‌తి నెలా జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న ప్ర‌భుత్వాన్ని ఆదుకోవాల్సిన ఉద్యోగులు ఇప్పుడు స‌మ్మె బాట ప‌ట్టారు. ప్ర‌భుత్వాల‌ను కూల‌దోస్తాం..అంటూ బెదిరింపుల‌కు దిగారు. పీఆర్సీని సిఫార‌స్సు చేసిన ఐఏఎస్ ల‌ను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారు. చంద్ర‌బాబు ఆనాడు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చిన విష‌యాన్ని చెబుతూ ఇప్పుడు జ‌గ‌న్ కూడా అలాగే ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగుల ఉడ‌త ఊపుల‌కు ఏ మాత్రం తలొగ్గ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ తాజా పీఆర్సీ ప్ర‌కారం జీతాలు ఇవ్వ‌డానికి ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ కొత్త సాఫ్ట్ వేర్ నూ సిద్ధం చేసింది.

జీవోను వెనక్కు తీసుకోవాలంటూ గురువారం ఉపాధ్యాయులు కలెక్టరేట్లను ముట్టడించారు. చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఉద్యోగులు కూడా ఆందోళనలను ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న వారు.. శుక్రవారం రోజు సీఎస్ సమీర్ శర్మను కలిసి ముందస్తు సమ్మె నోటీసును ఇవ్వనున్నారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందే సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి ఐక్యవేదికలు ఇవాళ నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశాయి.

ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ఒక వైపు మ‌రో వైపు ఉద్యోగుల స‌మ్మె ను ఫోకస్ చేస్తూ ఒక భాగం మీడియా హైప్ క్రియేట్ చేస్తోంది. ఆనాడు చంద్ర‌బాబు ఇచ్చిన త‌ర‌హాలో జ‌గ‌న్ ఫిట్మెంట్ ఇవ్వాల‌ని, 70 డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగుల ప‌క్షాన నిలుస్తోంది. ఏపీ ఆర్థిక ప‌రిస్థితుల‌తో పాటు లోటు బ‌డ్జెట్ , విభ‌జ‌న త‌రువాత అక్క‌డి తిరోగ‌మ‌న‌ అభివృద్ధి తెలిసి కూడా జ‌గ‌న్ మీద ఉన్న వ్య‌క్తిగ‌త ద్వేషంతో ఉద్యోగుల‌ను ఒక భాగం మీడియా రెచ్చ‌గొడుతోంది. ఒక ప‌థకం ప్ర‌కారం వ్యూహాల‌ను కొన్ని విప‌క్షాలు, ఒక భాగం మీడియా ర‌చిస్తోంద‌ని గ‌మ‌నించిన జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తోంది. ప్ర‌తిగా నిఘా వ‌ర్గాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఢీ అంటే ఢీ అంటోన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేత‌ల కొమ్ములు దీయ‌డానికి సిద్దం అవుతోంది. భ‌విష్య‌త్ లో ఉద్యోగుల మ‌ద్ధ‌తు లేకపోయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు న‌డుస్తాయ‌నే సంకేతం ఇచ్చేలా జ‌గ‌న్ స‌ర్కార్ మాస్ట‌ర్ ప్లాన్ చేస్తోంద‌ని స‌చివాల‌య వ‌ర్గాల టాక్‌. ప్ర‌భుత్వానికి, కొంద‌రు ఉద్యోగుల‌కు న‌డుమ న‌డుస్తోన్న గేమ్ క్లైమాక్స్ ఏమిటో చూడాల్సిందే.!

Exit mobile version