Site icon HashtagU Telugu

Prashant Kumar Vs CM Jagan : ఎన్వీ ర‌మ‌ణ దెబ్బ‌కు ఏపీ సీఎం గిలగిల‌

Jagan Chief Justice

Jagan Chief Justice

ఏపీలో న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఆధిప‌త్యం చెలాయించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రిగింది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి న్యాయ వ్య‌వ‌స్థపై ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు. తీర్పులు చెప్పిన జ‌డ్జిల‌పై వైసీపీ లీడ‌ర్లు, కొంద‌రు మాజీ మంత్రులు సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. దానిపై సీబీఐ విచార‌ణ కూడా జ‌రుగుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమ‌వారం సాయంత్రం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు.

విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్, సీఎం జ‌గ‌న్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో కలుసుకున్నా ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రాజ‌ధానుల విష‌యంలో హైకోర్టు తీర్పు జ‌గ‌న్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని హైకోర్టు తేల్చేసింది. అంతేకాదు,

డెడ్ లైన్ విధిస్తూ రైతుల‌కు ప్లాట్ల‌ను కేటాయించాల‌ని ఆదేశించింది. ఆ తీర్పుపై కూడా వైసీపీ నేత‌లు ప‌లు విధాలుగా విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో సుప్రీం కోర్టు కు జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మీద కూడా ఫిర్యాదు చేసిన సంద‌ర్భం ఉంది. ఒక ర‌కంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్య‌క్ష యుద్ధానికి జ‌గ‌న్ దిగారు. కానీ, ఆయ‌న యుద్ధం ప్ర‌భావం న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఏమీ ఉండ‌ద‌ని ఎన్వీ ర‌మ‌ణ సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ అయిన త‌రువాత వైసీపీకి బోధ‌ప‌డింది.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ప‌లు మార్పులు తీసుకొస్తూ ఎన్వీ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఆయ‌న స‌మ‌ర్థ‌త‌ను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈనెల 30వ తేదీన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల జ‌డ్జిల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు. ముఖ్య అతిథులుగా ఎన్వీ ర‌మ‌ణ‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల‌తో పాటు దిగువ కోర్టుల్లో ఉన్న స‌మ‌స్య‌లు, ఇత‌రత్రా మౌలిక సదుపాయాల‌పై మాట్లాడ‌తారు. స‌త్వ‌ర న్యాయం కోసం సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డానికి ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఏపీ సీఎం, హైకోర్టు జ‌డ్జి భేటీ అవుతున్నారా? ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించ‌డానికా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైకోర్టును క‌ర్నూలుకు మార్చాల‌ని ఏపీ స‌ర్కార్ ప్ర‌తిపాద‌న ఉంది. అందుకోసం హైకోర్టు బార్ తీర్మానంతో పాటు సుప్రీం కోర్టు అనుమతి కూడా అవ‌స‌రం. దాని గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. హైకోర్టులో ఆ బిల్లును ఉప‌సంహరించుకుంటూ పిటిష‌న్ వేసిన ఏపీ స‌ర్కార్ మ‌ళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ఈసారి ఎన్నిక‌ల‌కు కూడా అదే ఎజెండాతో వెళ్లాల‌ని జ‌గ‌న్ ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం. ఎన్నిక‌ల లోపు హైకోర్టును క‌ర్నూలుకు మార్చే అంశాన్ని హైకోర్టు జ‌డ్జి దృష్టికి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. బ‌హుశా ఇవాళ జ‌రిగే భేటీలోని ప్ర‌ధాన అంశం కూడా ఇదే ఉంటుంద‌ని వినికిడి. మొత్తం మీద ఈనెల 30వ తేదీన దేశ వ్యాప్తంగా న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న స‌మావేశానికి ముందుగా ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌డ్జిస్ భేటీ కీల‌కంగా మారింది.