TTD: అయోధ్య రాములోరికి తిరుమల శ్రీవారి లడ్డూలు

  • Written By:
  • Updated On - January 19, 2024 / 02:47 PM IST

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 22న అయోధ్య రామమందిరంలో సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా భక్తులకు పంచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష శ్రీవారి లడ్డూలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు లడ్డూలను ప్యాకింగ్ చేసే పనిలో 350 మంది కార్మికులు చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. 350 బాక్సుల్లో ప్యాకెట్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో బాక్సులో 150 ప్యాకెట్ల లడ్డూలు ఉంటాయని, ఒక్కోటి 25 గ్రాముల బరువుంటాయని తెలిపారు. “శ్రీరాముని భక్తులకు ఈ పవిత్రమైన నైవేద్యాల యొక్క సహజమైన నాణ్యతను నిర్ధారించడానికి” ప్యాకింగ్ ప్రక్రియలో వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని TTD మూలం తెలిపింది. జనవరి 20న తిరుమల నుంచి లక్ష లడ్డూలను పంపించాలని టీటీడీ నిర్ణయించింది.

త్వరలో రామ మందిరం ప్రారంభోత్సవ ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనున్నారు. సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లను జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ నుంచి బయల్దేరే అయోధ్య రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఇక ఆలయ ప్రతిష్టాపన జరిగాక అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు అయోధ్య ఆహ్వానం అందుకున్నారు.