Site icon HashtagU Telugu

TTD: టిటిడి కొత్త చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ కోటా పెంపు…

Ttd Special Entry Darshan

Ttd Special Entry Darshan

TTD: తిరుమలలో బోర్డు సభ్యుల ప్రాధాన్యత పెరగనుంది. ఇప్పటి వరకు బోర్డు సభ్యులకు శ్రీవారి దర్శనము, సేవా టికెట్ల కోటా లభించడం పరిమితంగా ఉండేది. తాజాగా, ఈ కోటాను పెంచాలని నిర్ణయించారు. అలాగే, ఎమ్మెల్యేలకు ఇవ్వబడే కోటాను కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 18న జరగనున్న కొత్త పాలక మండలి తొలి సమావేశంలో, టీటీడీ చేపట్టే పలు సంస్కరణలతో పాటు, బోర్డు సభ్యులు మరియు ఎమ్మెల్యేల దర్శన, సేవా కోటా టికెట్ల పెంపు గురించి తీసుకున్న నిర్ణయంపై ఆమోద ముద్ర వేయనున్నారు.

బోర్డు సభ్యుల దర్శన కోటా:

టీటీడీ నూతన పాలక వర్గం కొలువు తీరింది. ఈ నెల 18న తిరుమలలో తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ఉన్న శ్రీవారి దర్శన, సేవా టికెట్ల కోటా పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ మేరకు, బోర్డు సభ్యులకు సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు 20 బ్రేక్ దర్శన టికెట్లు, శనివారం మరియు ఆదివారం 12 టికెట్లు చొప్పున జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, వారానికి నాలుగు కళ్యాణోత్సవ టికెట్లు, మరో నాలుగు సుప్రభాతం సేవల టికెట్లు బోర్డు సభ్యుల కోటాలో మంజూరు చేయాలని నిర్ణయానికి ఆమోదం తెలపనున్నారు.

ఎమ్మెల్యేల దర్శన కోటా:

ఎమ్మెల్యేల కోటా పై సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు, చంద్రబాబు గారు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇకపై, ఎమ్మెల్యేలకు ప్రతి వారంలో ఆరు రోజులు, రోజుకు ఆరు సుప్రభాతం (రూ. 300 టికెట్లు) మంజూరవ్వాలని నిర్ణయించారు.

ప్రస్తుతం, తిరుమల దర్శనాలకు సంబంధించి, వారంలో నాలుగు రోజులపాటు మాత్రమే ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నారు. అయితే తాజా నిర్ణయం ప్రకారం, ఈ లేఖలను ఆరు రోజులకు అనుమతించడానికి మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే, సేవా కోటా కూడా మార్పులకు గురవుతున్నట్లు సమాచారం.

తెలంగాణ ఎమ్మెల్యేలు సైతం తమ లేఖల గురించి ఏపీ ప్రభుత్వానికి చేసిన వినతుల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా.. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శన విధానంలో పాత విధానాలు పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి.

దివ్య దర్శన టికెట్లు:

2008లో అలిపిరి మరియు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా భక్తులకు “దివ్య దర్శనం” పేరిట టోకెన్లు జారీ చేయబడేవి. అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టులో 6 వేల టోకెన్లు జారీ చేయాలని 2017లో నిర్ణయించబడింది. కానీ కొవిడ్‌ కారణంగా ఈ టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రస్తుతం, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు జారీ చేస్తున్నారు. అలిపిరిలోనూ ఈ టోకెన్లను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోనున్నారు.

అలాగే, ఆఫ్‌లైన్ శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.